వళిభిర్ముఖమాక్రాన్తం ఫలితేనాం కితం శిరః
గాత్రానిశిథిలాయత్తే తృష్ణైకా తరుణాయతే
“ముఖం ముడతలు పడుతున్నది, వెంట్రుకలు నెరిసిపోతున్నవి, గొంతు గాద్గద్యమవుతున్నది, కానీ కోరికలు మాత్రం నవయవ్వనంతో పరుగెడుతున్నాయి’’ అని వేలయేండ్ల క్రితం భర్తృహరి చెప్పిన మాట గుర్తుకొస్తున్నది. 125 ఏండ్ల వృద్ధ కాంగ్రెస్ మరో వృద్ధుడిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం గల మల్లికార్జున ఖర్గే శశిథరూర్ పై గొప్ప విజయాన్నే సాధించాడు. స్మార్ట్ గా, ఆధునికుడిగా, మేధావిగా పేరుపొందిన శశిథరూర్ ఘోర పరాజయం పొందకపోవడం మాత్రం గొప్ప విషయం. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ కోసం మొదట అందరూ తహతహలాడారు. బహుశా! సోనియాగాంధీ కుటుంబం కంట్రోల్ లేకుండా పార్టీ నడుస్తుందన్న భ్రమల్లో అడుగు ముందుకేసారు. అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్ తో సహా కొందరు విధేయులను తయారుచేస్తే కథ అడ్డం తిరిగింది. ఈ లోపు శశిథరూర్ ‘నాకేం తక్కువ’ అని ఇంకో అడుగు ఎక్కువ దూకాడు. అధిష్టానానికి ఇంకో వీర విధేయుడైన ‘ఖర్గే’ను రంగంలోకి దింపింది. ఈ వార్త తెలియగానే దిగ్విజయ్ సింగ్ వెనక్కి తగ్గాడు. అంతకుముందు అశోక్ గెహ్లాట్‌కు ఇష్టం లేకున్నా ‘బలవంతం పెళ్లి’ చేద్దామని చూస్తే, అక్కడ తన సీటు ఎక్కడ సచిన్ పైలట్ ఎగరేసుకుపోతాడో అని అశోక్ గెహ్లాట్ చేయాల్సిన రాద్ధాంతం అంతా చేయించాడు.
సంతుష్టీకరణ రాజకీయాలతో..
నిజానికి రాహుల్ గాంధీ అందరిలా ప్రమాదకరమైన రాజకీయనాయకుడు కాదు, సీరియస్ పొలిటీషియన్ కాకపోవడం కూడా గమనార్హం. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా అతనికి రాజకీయ గురువుగా సరైన వ్యక్తి, వ్యవస్థా లేదు. చుట్టూ ఉన్న కోటరీ ఈరోజు ఆరెస్సెస్ లాంటి సంస్థలను తిట్టడమే సిలబస్ గా నేర్పిస్తున్నారు. నాడు రోహిత్ వేముల ఆత్మహత్య మొదలుకొని నేటి పాదయాత్ర వరకు రోజూ ఆరెస్సెస్, బీజేపీలను నిందించే క్రమంలో ‘హిందుత్వం’ను తిట్టే పని రాహుల్ తో చేయిస్తున్నారు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేకపోగా ఈ దేశ మెజార్టీ ప్రజల మనోభావాలు గాయపడుతున్నాయి. నెహ్రూ కాలంలో ఉన్నట్లు గుడ్డిగా ‘లౌకికవాదం’ అనుసరించే వ్యక్తుల సంఖ్య ఇపుడు దేశంలో తగ్గింది. దానికి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి ఈ దేశ చరిత్రపై, అకాడమీలపై, వ్యవస్థలపై, జాతీయవాదంపై దాడిచేసేందుకు ‘సెక్యులరిజం’ పేరుతో చేసిన అరాచకమే కారణం. ఇపుడు వారి మాటలను ఈ దేశం నమ్మడం లేదు. ముఖ్యంగా యువత 'సోషల్ మీడియా’ తమ చేతిలోకి వచ్చాక ప్రతివాళ్ల ‘హిపోక్రసీ’ వెంటనే పట్టేస్తున్నది. దేశాలకు ‘జాతీయ భావం’ ఉండకపోతే ప్రపంచ దేశాలు ఎలా ధ్వంసం అయిపోతున్నాయో ఈ దేశ యువకులు, విజ్ఞులు గమనిస్తున్నారు. మనలాంటి సాంస్కృతిక వారసత్వం ఉన్న దేశాల ప్రజలు అడుగు ఇంకాస్త ముందుకేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఇవేవీ గమనించకుండా ‘సంతుష్టీకరణ రాజకీయాల’ను ప్రోత్సహిస్తే పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా నిష్ప్రయోజనం. ‘దేశంలోని ప్రజలంతా సమానం’ అన్న భావన వదలి పెట్టి ‘కొందరు ఎక్కువ సమానం’ అనుకునే పాలసీ అన్ని పార్టీలు వదలిపెట్టకపోతే బీజేపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. ఈ దేశంలోని బౌద్ధులు, జైనులు, పార్శీలు, సిక్కుల్లాగా జీవించకుండా ‘మేం ప్రత్యేకం’ అనుకొనే కొన్ని మైనార్టీ వర్గాల బుజ్జగింపు ఇక సాధ్యం కాదు. ఇక్కడి మెజార్టీ ప్రజలపై ఏ రకమైన దాడి జరిగినా మౌనంగా ఉండడమే ‘సెక్యులరిజం’ అన్న భావన వదలిపెట్టాలి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీ ఈ ‘సిలబస్’ సరిచేసుకోకపోతే ఆ పార్టీకి భవిష్యత్తు లేదు. కమ్యూనిస్టులను ప్రజలు ఎలా తిరస్కరించారో కాంగ్రెస్ అదే పరిస్థితి కోరి తెచ్చుకుంటున్న కారణం ఇదే. అదే హనుమాన్ చాలీసా చదివే కేజ్రీవాల్, దుర్గాపూజ చేసే మమతా బెనర్జీ, ఆయత చండీయాగం చేసే కేసీఆర్, స్వరూపానందేంద్రతో పూజలు చేస్తున్న జగన్.. సక్సెస్ అయ్యింది ఇక్కడే.
మూస పద్ధతిలో పార్టీని నడిపితే వృథా..
యుపీఏ హయాంలో మతహింస బిల్లు, రాజేంద్ర సచార్ కమిటీ నివేదిక అమలు, వక్స్ చట్టం వంటి మెజార్టీ ప్రజలను బోనులో నిలబెట్టే చర్యలు; బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ కుంభకోణాలు ప్రజలను కదిలించి యూపీఏను కూలదోశాయి. దానికితోడు సల్మాన్ ఖుర్షీద్, మణిశంకర్ అయ్యర్, అహ్మద్ పటేల్, దిగ్విజయ్ సింగ్ లాంటి ‘సంతుష్టీకరణ వాదులు’ కాంగ్రెస్ ను సర్వనాశనం చేశారు. ఇపుడు అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే గుల్బర్గాలో పెద్ద బౌద్ధ నిర్మాణం చేసిన దళిత నాయకుడు. తను బాబాసాహెబ్ అంబేడ్కర్ వారసుడిగా ఫీల్ అయి బౌద్ధం అనుసరించడం వరకు సవ్యంగానే ఉంది. బాబాసాహెబ్ ‘హిందుత్వం’లోని ‘కుల నిర్మూలన’ కోసం చేసిన సమరం నిజాయితీ పోరాటం. కోట్లకు పడగలెత్తిన మల్లికార్జున ఖర్గే ఇప్పుడు బౌద్ధం ఆచరిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ఏఓ హ్యూంతో కాంగ్రెస్ ను స్థాపింపచేసి ‘నూట్రల్స్’ను జాతీయభావం లేకుండా చేయాలని చూశారు. 1888–-89 జార్జ్ హూలే, విలియం లెడ్జర్బర్న్ వంటి ఆంగ్లేయులు కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారన్న విషయం చాలామందికి తెలియదు. ఈ మూలమలుపుల్లో సీతారాం కేసరి వంటి వారు ఘోర అవమానంతో తన పదవిని త్యాగం చేశారన్నదీ గుర్తులేదు. ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిన పీవీకి ఎంత అవమానం జరిగిందో ఎవరూ చెప్పరు? ఇప్పటికీ ఆ కుటుంబం ఉంటేనే ‘కాంగ్రెస్’ బతుకుతుందన్న భ్రమలు పెంచారు.1987–-88లో వి.పి.సింగ్, కేరళలో కరుణాకరన్, తమిళనాడులో మూపనార్, మహారాష్ట్రలో శరద్ పవార్, ఈశాన్య రాష్ట్రాల్లో పి.ఎ.సంగ్మా, తెలుగు రాష్ట్రాల్లో ఎన్.జీ. రంగా, చెన్నారెడ్డి ఇలా రాష్ట్రానికి ఒక ముక్కగా మారింది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ‘పార్టీ అందరిదీ’ అన్నవిధంగా తీర్చిదిద్దుకోలేని స్థితి. అందుకే కాంగ్రెస్ సిలబస్‌లో మార్పు రావాలి. ఈ చర్చ ఎందుకంటే మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షుడై తాను సర్వజనామోదమైన వ్యక్తిగా కాకుండా కాంగ్రెస్ ను మూసపద్ధతిలో నడిపితే నిన్నమొన్నటి ‘అధ్యక్ష ఎన్నిక’ల ఖర్చు దండగ.
అపరిపక్వత..
ఇప్పుడు ఎన్నికైన ఖర్గే గుడ్డిగా సోనియా,- రాహుల్ లను సమర్థిస్తాడని అందరికీ తెలుసు. వాస్తవానికి రేపు రాహుల్ గాంధీ ఎప్పుడైనా అవకాశం దొరికి ప్రధాని అవుతాడని అనుకొంటే సిద్ధం చేయకుండా ఇపుడో ‘విఫల ప్రయోగం’ చేయడం మరో చారిత్రక తప్పిదమే. ఖర్గే సమర్థుడైనా, ‘సోనియా కోటరీ’ని ఎదిరించి నిర్ణయాలు తీసుకొనే శక్తి లేదన్నది జగమెరిగిన సత్యం. అతడు అధ్యక్షుడిగా గెలిచాడంటేనే అధిష్టానం చల్లనిచూపులు ఆయన మీద ఉన్నాయనేది కాదనలేని నిజం. ఒకవేళ ‘గాంధీ-–నెహ్రూ కుటుంబం ప్రమేయం ఇక కాంగ్రెస్ పై ఉండదు’ అని ప్రకటించి అధ్యక్ష ఎన్నికలు జరిపితే వి.హనుమంతరావు కూడా పోటీలో ఉండేవాడు. కాంగ్రెస్ కు వ్రతం చెడ్డా సుఖం దక్కడం లేదు. ఎలాగూ ‘గాంధీ - నెహ్రూ’ కుటుంబాల ప్రభావం పార్టీపైన ఉందనుకున్నప్పుడు ‘రాహుల్ గాంధీ’ నే తయారుచేస్తే పోయేది. రాహుల్ లో ‘బోళాతనం, అమాయకత్వం’ ఉన్నమాట వాస్తవం. రాజకీయానుభవంలో మాత్రం ‘అపరిపక్వత’ నిండుగా ఉంది. కానీ ఆయన చుట్టూ ఉన్న ‘కవచాలు’ అతడిని మునగనివ్వరు,తేలనివ్వరు. లేకపోతే ఓ యువకుడు ఈ దేశంలోని యువతను ఎంతమాత్రం ప్రభావితం చేయలేకపోవడం ఏమిటి? ఆఖరుకు అఖిలేశ్ ను చూసైనా రాహుల్ కొన్ని రాజకీయాలు నేర్చుకోవాలి. ఇంచుమించు రాహుల్ వయస్సుతో సమానమైన యోగి చాతుర్యం ఇపుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేయబోతోంది కదా? మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో 30కి పైగా ఎన్నికలు ఓడిపోవడం, పార్టీ అథఃపాతాళానికి వెళ్లడం ఆయన సమర్థతను తెలియజేయడం లేదా! – డా. పి. భాస్కర యోగి, సోషల్ ఎనలిస్ట్