ఖమ్మం సభ ఓ ఎత్తుగడే! : డా. పెంటపాటి పుల్లారావు

రాజకీయ పార్టీలన్నీ ఖమ్మం జిల్లాపై దృష్టి సారిస్తున్నాయి. మొన్న చంద్రబాబు నాయుడు ఖమ్మంలో సభ పెడితే, ఇవ్వాల సీఎం కేసీఆర్ కూడా బీఆర్​ఎస్​ ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. భవిష్యత్​లో బీజేపీ, కాంగ్రెస్​ ఇతర పార్టీలు కూడా అక్కడ సభలు పెట్టే అవకాశం లేకపోలేదు. ఈ పార్టీలు ఖమ్మంలోనే సభలు ఎందుకు పెడుతున్నాయి? వాటి వ్యూహం ఏమిటి? అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తున్నది. 

హైదరాబాద్​స్టేట్ లో భాగంగా ఖమ్మం సుమారు 200 ఏండ్లు నిజాం ఏలుబడిలో ఉన్నది. దాన్ని పూర్వం ఖమ్మంమెట్​అని పిలిచేవారు. ఈ ప్రాంతం నిజాం హైదరాబాద్‌‌లో భాగంగా ఉన్నప్పటికీ, ఇక్కడి ప్రజలు, సామాజిక సమూహాలు, సంస్కృతిపై ఆంధ్రా ప్రాంత ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఖమ్మం జిల్లా ఉభయగోదావరి జిల్లాలతోపాటు రాజమండ్రి వంటి ప్రధాన కోస్తాంధ్ర నగరాలకు సమీపంలో ఉంది. ఏలూరు, విజయవాడ, గుంటూరు లాంటి పట్టణాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు విరివిగా ఉంటాయి. నిజానికి హైదరాబాద్​కంటే వారికి ఓడరేవు, విమానాశ్రయం ఆంధ్రాలోనే దగ్గర కాబట్టి ఖమ్మం వాసులు వాటి సేవలను నేటికీ ఉపయోగించుకుంటున్నారు. దీంతోపాటు ఖమ్మం ఆంధ్ర, చత్తీస్‌‌గఢ్, మధ్యప్రదేశ్‌‌, ఒడిశా, జార్ఖండ్‌‌లోని అడవులు, గిరిజన బెల్ట్‌‌లకు సమీపంలో ఉంటుంది. పైగా ఈ రాష్ట్రాల్లో ఉండే మెజార్టీ గిరిజనులు ఒకే మాండలికం మాట్లాడతారు. అందుకే ఖమ్మం భౌగోళికంగా విస్తృత ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రాంతం. అందుకే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడి రాజకీయాలు కొంత భిన్నంగా, ఓపెన్​గా ఉంటాయి. అంతర్జాతీయ రాజకీయాల్లో ‘భౌగోళిక రాజకీయాలు(జియో పాలిటిక్స్)’’ అనే పెద్ద సిద్ధాంతం ఒకటి ఉన్నది. రాజకీయాలపై భౌగోళిక ప్రభావం ఉంటుందనేది దాని మూలం. ఖమ్మం అనేక రాష్ట్రాలు, ఇతర భాషలలకు దగ్గరగా ఉన్నందున ‘భౌగోళిక రాజకీయాల”ప్రభావం ఇక్కడ ఉంటుంది. పైగా ఖమ్మంలో అన్ని కులాలు, సామాజిక వర్గాలు సమానంగా ఉన్నాయి. ఇక్కడ ఏ వర్గం ఆధిపత్యం పెద్దగా లేదు. 

అన్ని పార్టీలకు అవకాశం

ఖమ్మం జిల్లాలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. రాజకీయంగా ఇక్కడ పార్టీలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. ఖమ్మంలో ఏ పార్టీ, కులం ఆధిపత్యం లేకపోయినా.. కొన్ని సామాజిక వర్గాల ప్రభావం మాత్రం ఉంటుంది. ఖమ్మం జిల్లాలో కొంత భాగం, ముఖ్యంగా భద్రాచలం తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉండేది. 1954లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత, పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మంలో భాగమైంది. అయితే ఇక్కడ శక్తిమంతమైన సామాజిక వర్గాలుగా ఉన్న రెడ్డిలు, కమ్మలు, కాపులు, వెలమలు వారి సొంత రాజకీయ విధేయతతో ఉన్నారు. ఖమ్మంలో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ్​రావు తర్వాత పెద్ద నాయకుడెవరూ ఎదగలేదు. ఎవరికీ పూర్తి స్థాయి పట్టు దొరకలేదనేది స్పష్టమవుతున్నది. ఆయన లేకుండా తెలంగాణలో బీజేపీ గెలవదని, ఆ పార్టీ దృష్టిని ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు తనకు గతంలో కొంత పట్టు ఉన్న ఖమ్మంలో బహిరంగ సభతో బిగ్ షో వేశారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇక్కడ అంతా మెరుగ్గా ఏమీ లేదు. ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే  భట్టి విక్రమార్కపై కాంగ్రెస్​ఉనికి ఆధారపడి ఉండొచ్చు. తెలంగాణలో బీజేపీ గెలవాలంటే ఖమ్మంలో కొన్ని సీట్లు గెలిచి తీరాలి. ఇలా పార్టీలకు ఖమ్మంతో రకరకాల ప్రాధామ్యాలు ఉన్నాయి. 

ఇతర ప్రాంతాలపై ప్రభావం

కేసీఆర్‌‌కు ఖమ్మం పెద్ద సవాల్‌‌తో పాటు గొప్ప అవకాశం కూడా. ఖమ్మంలో కేసీఆర్ బాగా రాణించి, భారీ సభలు నిర్వహిస్తే, ఆ ప్రభావం ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌‌పై పడుతుంది. ఖమ్మంలో రాజకీయ సందడి పొరుగునే ఉన్న ఏపీపై ప్రభావం చూపుతుంది. ఒక చోట జరిగే చర్య మరోచోట ప్రభావం చూపుతుంది. దీన్ని యుద్ధంలో ‘అనుషంగిక ప్రభావం’ అంటారు. ఖమ్మంలో బీఆర్ఎస్​ ఎస్టాబ్లిష్​మెంట్​బాగుంటే.. ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్, చత్తీస్​గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలపై ఉంటుంది. విఫలమైనా ఆ మేరకు నష్టం ఉండకపోదు. ఇదీగాక ఖమ్మం బీఆర్ఎస్​లో వర్గపోరు ఉన్నది. బీజేపీకి ఇదో పెద్ద అవకాశం. ఖమ్మంలో మరిన్ని బహిరంగ సభలు జరిగే అవకాశం ఉన్నది.

ఖమ్మంలో బీఆర్ఎస్​ బలహీనం

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్​ పార్టీ ఖమ్మంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2014, 2018 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 ఎమ్మెల్యే స్థానాలకు గానూ గులాబీ పార్టీ ఒక్కో ఎమ్మెల్యే చొప్పునే గెలుచుకున్నది. గులాబీ పార్టీకి ఇది బలహీనమైన ప్రాంతం. ఎందుకంటే భౌగోళిక, సామాజిక వర్గ పరిస్థితులు ఖమ్మంపై ప్రభావం చూపుతాయి. ఖమ్మంపై ఆధిపత్యం సాధించడం కష్టమే. అందుకే గులాబీ బాస్​కేసీఆర్​ఖమ్మంలో బీఆర్ఎస్​ ఆవిర్భావ సభ పెట్టి బలాన్ని చాటాలని చూస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత, తెలంగాణలో టీడీపీ కనుమరుగైంది. దానికి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్న చంద్రబాబు పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించడంతోపాటు దానికి అంతకు ముందు కొంత పట్టు ఉన్న ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. 2018లో ఖమ్మంలో10 స్థానాలకు టీడీపీ 2 స్థానాలను గెలుచుకుంది. 2018లో టీడీపీతో కూటమి కారణంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఇక్కడ10 స్థానాలకు కాంగ్రెస్​7 గెలుచుకుంది. అయితే దాదాపు ఎమ్మెల్యేలంతా టీఆర్‌‌ఎస్‌‌లోకి ఫిరాయించారు. టీఆర్ఎస్​ గెలుచుకున్నది ఒక్క ఎమ్మెల్యే స్థానమే. దీంతో ఖమ్మంలో పొలిటికల్ ​స్పేస్​ ఉందని, ఇక్కడ ఎవరి ఆధిపత్యం లేదని తేలిపోయింది. దాన్ని పొందేందుకే కేసీఆర్​ తాపత్రయ పడుతున్నారు.

– డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్