రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఏకగ్రీవంగా ఎన్నిక
సర్కారు కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని తీర్మానం
హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (జీజేఎల్ఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి డాక్టర్ పి.మధుసూదన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం అబిడ్స్ లోని మెథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజీలో జీజేఎల్ఏ రాష్ట్ర మూడో కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా నూతన స్టేట్ కమిటీని ఎన్నుకున్నారు.
జీజేఎల్ఏ స్టేట్ ప్రెసిడెంట్గా మధుసూదన్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా బలరామ్ జాదవ్ (నిర్మల్), అసోసియేట్ ప్రెసిడెంట్గా ఈ. శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా విజయశేఖర్ (సంగారెడ్డి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఫైనాన్స్ సెక్రటరీగా ఏ.శివప్రసాద్, లేడీ సెక్రటరీగా ఎస్.పద్మావతి, వైస్ ప్రెసిడెంట్లుగా సింగం శ్రీనివాస్, సత్యపాల్ రెడ్డి, జి.వేణుగోపాల్, టి.శ్రీధర్, ఎన్.నరేష్, వి.అశోక్, స్టేట్ సెక్రటరీలుగా వి.ప్రమీల, ఏఏవీ ప్రసాద్, ఎం.హరిప్రసాద్, ఫహీముద్దీన్, జి.మధు, కె.శ్రీదేవి ఎన్నికయ్యారు.
ఈ సమావేశానికి తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి హాజరై మాట్లాడారు. విద్యారంగం అభివృద్ధికి లెక్చరర్లు మరింత కృషి చేయాలని సూచించారు.
పలు తీర్మానాలు..
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, కనీనం విద్యారంగానికి బడ్జెట్లో పది శాతం నిధులు కూడా కేటాయించలేదని సమావేశంలో తీర్మానం చేశారు. రాష్ట్రంలో 10+2+3 విద్యావిధానాన్ని కొనసాగించి, ఇంటర్మీడియెట్ విద్యా అస్థిత్వాన్ని ఆవశ్యకతను గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు.