గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా రమేశ్​

గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా రమేశ్​

హైదరాబాద్, వెలుగు: గాంధీ మెడికల్‌ కాలేజీ పూర్తిస్థాయి  ప్రిన్సిపల్‌ గా మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌(డీఎంఈ) డా.కె.   రమేశ్​రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు జారీ చేయగా.. రమేశ్​రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇన్​చార్జి డీఎంఈగా, తెలంగాణ వైద్యవిధాన పరిషత్‌ (టీవీవీపీ) కమిషనర్‌ గా డాక్టర్‌ రమేశ్​రెడ్డి ఇప్పటికే  బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇకపై  వాటితోపాటు  గాంధీ మెడికల్​కాలేజీ  ప్రిన్సిపల్‌ గా ఉంటారు. ప్రస్తుత గాంధీ ప్రిన్సిపల్, న్యూరోసర్జరీ హెచ్‌ఓడీ ప్రొఫెసర్‌ జీ.ప్రకాశరావుకు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ గా పదోన్నతి కల్పించి బదిలీ చేశారు. కార్డియాలజీ ప్రొఫెసర్‌ నితిన్‌ కుమార్‌ కాబ్రాను ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపరింటెండెంట్ గా ట్రాన్స్​ఫర్ చేస్తూ ప్రమోషన్​ కల్పించారు.

గాంధీ మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రులకు చెందిన పలువురు ప్రొఫెసర్లకు పదోన్నతులు కల్పిస్తూ డీఎంఈ రమేశ్​రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గాంధీ ఇన్​చార్జి సూపరింటెండెంట్‌ గా చేస్తున్న జనరల్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ ఎం. రాజారావుకు పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌ గా పదోన్నతి కల్పించారు. పీడియాట్రిక్‌  ప్రొఫెసర్‌ శివరాంప్రసాద్‌ కు జగిత్యాల మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్​గా, ఆర్ధోపెడిక్‌  ప్రొఫెసర్‌ వాల్యాను నిజామాబాద్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్, కే. ఇందిరను నిజామాబాద్‌ కాలేజీ ప్రిన్సిపల్, మైక్రోబయోలజీ ప్రొఫెసర్‌ కే. నాగమణిని భద్రాద్రి కొత్తగూడెం మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ ప్రొఫెసర్‌ పీ. శ్రవణ్​కుమార్‌ను మహబూబాబాద్‌ ఆసుపత్రి  సూపరింటెండెంట్, బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌ మహ్మద్‌ దావూద్‌ సులేమాన్‌కు మంచిర్యాల కాలేజీ ప్రిన్సిపల్‌గా పదోన్నతులు కల్పిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు.