అప్పుడే పుట్టిన పిల్లల్లో శ్వాసకోశ వ్యాధి నివారణకు డాక్టర్ రెడ్డీస్ మందు

అప్పుడే పుట్టిన పిల్లల్లో శ్వాసకోశ వ్యాధి నివారణకు డాక్టర్ రెడ్డీస్ మందు

న్యూఢిల్లీ: నవజాత శిశువుల్లో (అప్పుడే పుట్టిన పిల్లల్లో)  దిగువ శ్వాసకోశ వ్యాధిని నివారించేందుకు  సనోఫీతో కలిసి ఓ డ్రగ్‌‌‌‌ను తీసుకొస్తామని  డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సోమవారం  ప్రకటించింది. బేఫోర్టస్‌‌‌ను పరిచయం చేయాలని ప్లాన్ చేస్తోంది.  ఈ మెడిసిన్‌‌‌‌లో  మోనోక్లోనల్ యాంటీబాడీ అయిన  నిర్సెవిమాబ్ ఉంటుంది.  నవజాత శిశువులు, శిశువులలో  దిగువ శ్వాసకోశ వ్యాధిని  నివారించడంలో ఇది సాయపడుతుంది. ఈ మందును ఇంజెక్షన్‌‌‌‌గా ఇస్తారు. దీనిని  24 నెలల వయస్సు వరకు ఉన్న పిల్లలకు కూడా ఇవ్వొచ్చు. తాజా భాగస్వామ్యంలో భాగంగా డాక్టర్ రెడ్డీస్ భారతదేశంలో బేఫోర్టస్‌‌‌‌ను ప్రచారం చేయడానికి, పంపిణీ చేయడానికి సనోఫీ నుంచి ప్రత్యేక హక్కులను పొందుతుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఇండియాలో ఈ డ్రగ్‌‌‌‌ను  కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ మందును  యూరోపియన్ యూనియన్, యూఎస్, చైనా, జపాన్,  ప్రపంచవ్యాప్తంగా అనేక ఇతర దేశాలలో వాడుతున్నారు. ఇండియాలో అమ్మేందుకు  సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి కిందటేడాది జూన్‌‌‌‌లో డాక్టర్ రెడ్డీస్ అనుమతులు పొందింది. గత సంవత్సరం  సనోఫీ వ్యాక్సిన్లను కూడా డాక్టర్ రెడ్డీస్ ఇండియాలో అమ్మింది.