డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,482 కోట్లు

డాక్టర్ రెడ్డీస్ లాభం రూ. 1,482 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో క్వార్టర్​లో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లాభం వార్షికంగా 33.02 శాతం వృద్ధితో రూ. 1,482.2 కోట్లకు చేరుకుంది. యూఎస్​ జనరిక్స్ మార్కెట్​ నుంచి భారీ రెవెన్యూ కారణంగా లాభం పెరిగింది.   ఏడాది క్రితం ఇదే క్వార్టర్​లో కంపెనీ రూ. 1,114.2 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ (డీఆర్​ఎల్​) రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 6,902.6 కోట్లుగా ఉంది. ఇది వార్షికంగా 9 శాతం పెరిగింది. గత క్యూ2లో ఇది రూ. 6,331.8 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ క్వార్టర్​లో డీఆర్​ఎల్​ మొత్తం ఖర్చులు 11.14 శాతం పెరిగి రూ.5,305.1 కోట్లకు చేరాయి. సెప్టెంబర్ క్వార్టర్​లో డీఆర్​ఎల్​ మొత్తం ఆదాయం 13.25 శాతం పెరిగి రూ.7,217.6 కోట్లుగా ఉంది.   తాజా క్వార్టర్​లో డీఆర్​ఎల్ ​గ్లోబల్ జెనరిక్స్ రూ. 6,113 కోట్లు సంపాదించింది. ఇది ఉత్తర అమెరికా, వర్ధమాన మార్కెట్లు,  యూరప్‌‌‌‌ల కారణంగా గత సంవత్సరంతో పోలిస్తే 9.14 శాతం పెరిగింది. ఉత్తర అమెరికా ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.3,170 కోట్లకు చేరుకుంది.