హైదరాబాద్, వెలుగు: ఆస్ట్రేలియా కంపెనీ మేన్ ఫార్మాకి చెందిన యూఎస్ జెనిరిక్ పోర్ట్‌ఫోలియోను డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ తన సబ్సిడరీ ద్వారా కొంటోంది. ఈ మేరకు మేన్ ఫార్మాతో అగ్రిమెంట్ కుదిరినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. డీల్ కోసం 105 మిలియన్ డాలర్లను కంపెనీ వెచ్చించనుంది. తన సబ్సిడరీ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఎస్ఏ ఈ మేరకు మేన్ఫార్మాతో డెఫినిటివ్ అగ్రిమెంట్ చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అప్ఫ్రంట్గా 90 మిలియన్ డాలర్లను క్యాష్ రూపంలో చెల్లించాలని, మిగిలిన 15 మిలియన్ డాలర్లను ఆ తర్వాత కొన్ని దఫాలుగా చెల్లించాలని డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. మేన్ ఫార్మా జెనిరిక్ పోర్ట్‌ఫోలియోలో 45 కమర్షియల్ ప్రొడక్టులు ఉన్నాయని, అనుమతులు వచ్చినా మార్కెట్ చేయని మరో 40 ప్రొడక్టులు కూడా ఉన్నాయని డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది.
మహిళల ఆరోగ్యంపై ఫోకస్‌తో చాలా జెనిరిక్ ప్రొడక్టులు ఈ పోర్ట్‌ఫోలియోలో భాగమని వివరించింది. ఈ పోర్ట్‌ఫోలియో నుంచి మేన్ ఫార్మాకు జూన్2022 తో ముగిసిన పీరియడ్‌లో 111 మిలియన్ డాలర్ల రెవెన్యూ వచ్చినట్లు డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. అమెరికా మార్కెట్లో మరింతగా దూసుకెళ్లడానికి ఈ కొనుగోలు సాయపడుతుందని డాక్టర్ రెడ్డీస్ భావిస్తోంది. హై ఎంట్రీ బారియర్ ఉన్న ప్రొడక్టులు కూడా కొన్ని ఈ డీల్ ద్వారా తమకు రావడం కలిసొస్తుందని అంచనా వేస్తోంది. లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం ఇలాంటి కొనుగోళ్లు వీలు కల్పిస్తాయని సీఈఓ ఎరెజ్ ఇజ్రేలీ చెప్పారు. మహిళల హెల్త్ సెగ్మెంట్లో చొచ్చుకుపోవడానికి తాజా డీల్ దారి కల్పిస్తుందని డాక్టర్ రెడ్డీస్ నార్త్ అమెరికా బిజినెస్ హెడ్ మార్క్ కికుచి పేర్కొన్నారు.