టీచర్ స్థాయి నుంచి భారత తొలి ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎనలేని సేవ చేసిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఉపాధ్యాయుల పాత్ర గురించి విద్యార్థులలో, సమాజంలో వస్తున్న మార్పులను అవలోకనం చేసుకోవడానికి ఇదొక సందర్భం. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక ఉపాధ్యాయుడితోనో, అధ్యాపకుడితోనూ ఒక అనుబంధం ఉంటది. మనలో ప్రతి ఒక్కరం, జీవితంలో ఎదగడానికి తోడ్పడిన పంతుళ్లను ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటాం. వాళ్ల వల్ల జీవితంలో వృద్ధిలోకి వచ్చిన తీరును యాది చేసుకుంటాం. టీచర్లు రకరకాల పద్ధతుల్లో విద్యార్థులను ప్రభావితం చేస్తారు. కొందరు టీచర్లు విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేస్తారు. మరికొందరు బాగా రాయడం నేర్పుతారు. కొందరు పంతుళ్లు విద్యార్థి నైతిక ఔన్నత్యాన్ని పొందడానికి చేయూతనిస్తారు. కొందరు భవిష్యత్తు నిర్మాణానికి మార్గనిర్దేశనం చేస్తారు. కొందరు ప్రశ్నించడం అలవాటు చేసి విద్యార్థి శోధనా శక్తిని పెంచుతారు. తమ స్వభావాన్ని బట్టి ఒక్కో టీచర్ ఒక్కొక్క రకంగా పిల్లల ఎదుగుదలకు తోడ్పడతారు. విద్యా బుద్ధులు నేర్పి జీవన యానంలో ముందుకు సాగటానికి కావలసిన శక్తిని, యుక్తిని ఇస్తారు కాబట్టి టీచర్లను మరిచిపోలేం.
పరిస్థితులు మారాయి
ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. టీచర్ పాత్ర మారి పోయింది. సరళీకరణ తరువాత విద్య స్వభావమే మారి పోయింది. అక్షర జ్ఞానాన్ని అందించే ప్రాథమిక విద్య తప్ప మిగతా విద్యారంగం వ్యాపారంగా మారిపోయింది. విద్య ఇప్పుడు ప్రైవేటు రంగం పరిధిలోకి వచ్చింది. ఈ మధ్య ప్రైవేటు రంగంలో యూనివర్సిటీలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పబ్లిక్ రంగంలోని విద్యాసంస్థల్లో టీచర్లకు మునుపున్న గుర్తింపు లేదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రాథమిక విద్య నుంచి, యూనివర్సిటీల దాకా తగినంత మంది టీచర్లు లేరు. కావాల్సిన స్థాయిలో సౌలత్లు లేవు. ఈ పరిస్థితిలో సహజంగానే పిల్లలు ప్రైవేట్ విద్యా సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు పర్యవసానంగా ప్రభుత్వ టీచర్లు గుర్తింపు కోల్పోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఈ పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రభుత్వం విద్యా సంస్థలను బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బోధన, బోధనేతర పోస్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయలేదు. స్కూళ్ల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి దాకా ఉన్న నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేయలేదు. నెలల తరబడి యూనివర్సిటీలకు వీసీల నియామకం, పాలక మండళ్లు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ప్రభుత్వ విద్యారంగం మరింత పతనమైంది. ఫీజు కట్టి ప్రైవేటులో చదువుకుంటే స్కూళ్లను నడిపే అవసరమే ఉండదనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
గుర్తింపు తగ్గించే కుట్ర
ప్రైవేటు రంగంలో టీచర్లను పైసలు తీసుకొని చదువు చెప్పే జీతగాళ్లుగా చూస్తున్నారు. విద్యాసంస్థల యాజమాన్యం టీచర్లకు గుర్తింపు రాకుండా జాగ్రత్త పడుతోంది. బోధనాంశాలను ముక్కలుగా విడగొట్టి ఒక్కో భాగాన్ని ఒక్కొక్కరికి అప్ప జెప్పి పిల్లలకు టీచర్లతో ఒక బంధం ఏర్పడకుండా జాగ్రత్త పడుతున్నారు. గతంలో టీచర్ పేరుతో స్కూళ్లు, కాలేజీలు నడిచేవి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు యాజమాన్యం బ్రాండు పేరుతో విద్యాసంస్థలకు గిరాకీ దొరుకుతున్నది. టీచర్ అనబడే ఉద్యోగికి పెద్దగా ప్రాధాన్యం లేదు. మారుతున్న కాలంలో మనం మన జీవితంలో చూసిన మునుపటి టీచరు అంతరించి పోయాడు. ఈ కాలంలో టీచరు కాంట్రాక్టు ఉద్యోగిగా మారిపోయాడు. ఇప్పటికీ బోధనలో టీచరు పాత్ర కీలకమైనది. కానీ ప్రభుత్వం, కార్పొరేటు విద్యాసంస్థలు కలిసి టీచరుకు గుర్తింపు లేకుండా చేశాయి. ఈ అవకాశాన్ని వాడుకొని బయట ఏవో వ్యాపకాలు పెట్టుకోవచ్చుననుకునే టీచర్లు లేక పోలేదు. టీచరు పాత్ర అంతరించడం వల్ల కలిగే అనర్థాలను కొందరు టీచర్లు విస్మరిస్తున్నారు. ఈ ధోరణి కారణంగా టీచర్లు తమ గుర్తింపు రద్దుకు తామే కారణమవుతున్నారు.టీచర్లకు గుర్తింపు ప్రభుత్వానికి ఇష్టం లేదనేది గ్రహించాలి. టీచర్లకు గుర్తింపు వస్తే వారు విద్యారంగంలో ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేయవచ్చు. అది ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఇక ఈ గుర్తింపు దొరికితే హక్కులు అడుగుతామని కార్పొరేటు రంగానికి భయం. అందుకే అటు ప్రభుత్వం, ఇటు కార్పొరేటు రంగం కుమ్మక్కై టీచర్ల గుర్తింపును హరించి వేస్తున్నాయి. టీచర్లు మేల్కొని తమ గుర్తింపును, అస్తిత్వాన్ని కాపాడుకోవాలి.
పంతుళ్ల పాత్ర మార లేదు
విద్యార్థులకు టీచర్లకు మధ్య ఉన్న సంబంధంలో 1970 దశకం తరువాత మార్పు వచ్చింది. అప్పటి వరకు చదువుకు దూరంగా ఉన్న దళితులు, బీసీలు, ఆదివాసుల -పిల్లలు బడికి వెళ్లడం మొదలు పెట్టారు. భూ సంస్కరణలు, రైతాంగ పోరాటాలు ఈ మార్పునకు కారణమయ్యాయి. పోరాటాల ద్వారా స్వీయ అస్తిత్వాన్ని పొందిన తరువాత చదువుకొని ఎదగాలన్న ఆలోచన అణగారిన వర్గాల్లో బలపడింది. అప్పుడే ప్రభుత్వం సాంఘిక సంక్షేమ హాస్టళ్లను, గురుకులాలను ప్రారంభించింది. చదువు నేర్చుకునే శక్తి పిల్లలందరికి– లింగ, కుల, వర్గాలతో నిమిత్తం లేకుండా -సమానంగా ఉంటుందని గుర్తించిన పంతుళ్లు, మారిన పరిస్థితిలో బాగా రాణించారు. మారుతున్న పరిస్థితులకు తగినట్టుగా బోధనా పద్ధతులను మార్చారు.విద్యా సంస్థల్లో ప్రజాస్వామిక వాతావరణాన్ని పెంపొందించడానికి, ప్రజాస్వామిక దృష్టి కోణం గల పంతుళ్లే అటు ప్రభుత్వానికి, ఇటు ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేశారు. పంతుళ్ల పాత్ర మార లేదు. కాకపోతే ముందుతో పోలిస్తే విద్యార్థుల సామాజిక పునాది విస్తరించింది.
-ఎం.కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు