- రాష్ట్ర ఎస్సీ ఏక సభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్
ఖమ్మం టౌన్, వెలుగు : షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై స్వీకరించిన దరఖాస్తులన్నింటిని స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని రాష్ట్ర ఎస్పీ ఏక సభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ షమీమ్ అక్తర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎస్సీ కులాలు, కుల సంఘాలు, వ్యక్తులతో బహిరంగ విచారణ నిర్వహించారు. పలువురు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దరఖాస్తు సమర్పించే వారందరూ ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా సమర్పించాలని కోరారు.
వీటన్నింటిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామన్నారు. కాగా మొత్తం 450 మంది వ్యక్తిగతంగా, కుల సంఘాల పరంగా దరఖాస్తులు అందజేశారు. అనంతరం చైర్మన్ ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడులోని ఎస్సీ కాలనీని సందర్శించారు. ఉపాధికి చేపడుతున్న పనుల గురించి, ప్రభుత్వం నుంచి పొందుతున్న సహాయం గురించి, పిల్లల చదువు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
అంతకుముందు చైర్మన్కు ఎన్ఎస్పీ అతిథి గృహం వద్ద కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్సీ సంక్షేమ అధికారులు కే.సత్యనారాయణ, అనసూయ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్సీ కార్పొరేషన్ ఈడీలు నవీన్ బాబు, ఉపేందర్ రావు, రాష్ట్ర కార్యాలయం సూపరింటెండెంట్ సజ్జన్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.