కుంటాల మండలానికి ఉచిత అంబులెన్స్ .. అందజేసిన డాక్టర్​ శశికాంత్​ దంపతులు

కుంటాల మండలానికి ఉచిత అంబులెన్స్ .. అందజేసిన డాక్టర్​ శశికాంత్​ దంపతులు

కుంటాల, వెలుగు: మారుమూల గ్రామంలో పుట్టి వైద్య రంగంలో ఉన్నత స్థాయికి చేరుకొని స్థిరపడిన కుంటాల మండలం ఓల గ్రామానికి చెందిన డాక్టర్ నాలం శశికాంత్ పుట్టిన ప్రాంతంపై మమకారంతో ఉచిత అంబులెన్స్ సేవలు కల్పించడం అభినందనీయమని ముథోల్ ఎమ్మెల్యే రామరావు పటేల్ అన్నారు. శశికాంత్ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సేవలను ఓల గ్రామంలో ఆదివారం ఆయన ప్రారంభించారు. రూ. 5 లక్షల విలువైన అంబులెన్స్​ను మండల ప్రజలకు అంకితం చేశారని ఎమ్మెల్యే కొనియాడారు.

 గ్రామీణ పేద ప్రజలకు తక్కువ ఖర్చులతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ సామాజిక సేవ కార్యక్రమాల్లో డాక్టర్ శశికాంత్–స్వప్న దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. అనంతరం స్వప్న హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. శిబిరంలో 500 మంది రోగులను పరీక్షించి అవసరమైన మందులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ఆప్క గజ్జరాం, పిప్పెర వెంగల్ రావు, రమణ రావు, శంకర్ గౌడ్, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.