- బీఆర్ఎస్నేత దాసోజు శ్రవణ్ వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు : సర్వే చేయకుండానే ప్రజల ఇళ్లు కూల్చి సీఎం రేవంత్ రెడ్డి ఘోర తప్పిదం చేశారని, దీనికి ఆయన శిక్షార్హుడని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. హైడ్రా బెదిరింపులకు కలత చెంది ఆత్మహత్య చేసుకున్న కూకట్ పల్లి బుచ్చమ్మ, కుటుంబ సభ్యులకు ఎవరు న్యాయం చేస్తారని ప్రశ్నించారు. ప్రజల కండ్లల్లో కన్నీళ్లు చూసిన పాపానికి సీఎం ప్రజా కోర్టులో ముమ్మాటికీ శిక్షార్హుడని మండిపడ్డారు.
ఇందిరాగాంధీ, రోటి, కాపడా, మకాన్ అనే సిద్ధాంతాలతో పరిపాలిస్తే, ఇప్పుడు అదే పార్టీకి చెందిన సీఎం ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అడుగుజాడలను అనుసరిస్తూ, బుల్డోజర్ రాజ్యం నడిపిస్తున్నారని విమర్శించారు. అమాయక ప్రజల ఇండ్లను కూల్చేస్తున్నారని తెలిపారు.
సొంత అన్నతో సహా డబ్బున్న పెద్దోళ్లకు నోటీసులు ఇచ్చి, సామాన్యుడి ఇండ్లు మాత్రం కూల్చి, తన ప్రజావ్యతిరేక ఫ్యూడల్ వైఖరిని చూపించారని ఆరోపించారు. కూల్చివేతకు గురైన ప్రజలకు సీఎం క్షమాపణలు చెప్పాలని.. వారికి నష్టపరిహారం చెల్లించి, పునరావాసం కల్పించాలని దాసోజు డిమాండ్ చేశారు.