
ముంబై: టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తమ కుటుంబంతో కలిసి లండన్‌లో సెటిలవ్వాలని నిర్ణయించుకున్నట్టు చాన్నాళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. తమ కుమారుడు అకాయ్‌కు అనుష్క అక్కడే జన్మనిచ్చింది. ఈ జంట లండన్‌లో ఓ విలాసవంతమైన ఇల్లు కూడా కొనుగోలు చేసింది. అక్కడే స్థిరపడటంపై ఈ ఇద్దరూ ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
కానీ, ఇండియాలో నిరంతరం తమను వెంటాడే మీడియాతో పాటు ప్రజల దృష్టికి దూరంగా సాధారణ జీవితం గడపాలన్న ఉద్దేశంతోనే కోహ్లీ, అనుష్క యూకేలో సెటిలవ్వాలని నిర్ణయించుకున్నారని బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ భర్త డాక్టర్ శ్రీరామ్ నెనే చెప్పాడు. అనుష్క శర్మ తనతో ఈ విషయం పంచుకుందని వెల్లడించాడు.
‘ఒకరోజు నేను, నా భార్య అనుష్కతో మేం మాట్లాడాం. తమ సక్సెస్‌ను ఇండియాలో సరైన రీతిలో ఆస్వాదించలేకపోతున్నామని చెప్పింది. ఏ పని చేసినా ప్రజలు తమవైపే చూస్తున్నారంది. వాళ్లిద్దరూ తమ జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలని, సాధారణ కుటుంబంలా జీవించాలని కోరుకుంటున్నారు. తమ పిల్లలను సాధారణంగా పెంచేందుకు లండన్ వెళ్లాలని ఆలోచించారు’ అని చెప్పాడు.