- ఆరు నెలల కోసం ఎందుకు బద్నాం
- జడ్పీ, మండల, మున్సిపల్ చైర్మన్లను వదిలేయాలని నిర్ణయం
- వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామంటున్న డీసీసీ అధ్యక్షుడు
నాగర్‌కర్నూల్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని వివధ జడ్పీ, మండల, మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలు పెడుతుండగా, నాగర్‌కర్నూల్ జిల్లా రాజకీయాలు అందుకు భిన్నంగా నడుస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు ఆరాటపడుతున్నా పార్టీ జిల్లా నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
జడ్పీలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీఉన్నా జడ్పీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేది లేదని అచ్చంపేట ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ స్పష్టం చేశారు. 3 నెలల చైర్మన్ కుర్చీ కోసం అవిశ్వాసం పెట్టి బద్నాం కావడం దేనికని అంటున్నారు. నాగర్ కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట మున్సిపాలిటీల్లో కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు ఎమ్మెల్యేలు, లోకల్ లీడర్లను సంప్రదిస్తున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు.
కాంగ్రెస్‌కు బలం ఉన్నా..
నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్‌లో 20 జడ్పీటీసీ స్థానాలుంటే బీఆర్ఎస్ 17 చోట్ల, కాంగ్రెస్ మూడు స్థానాల్లో గెలిచింది. తెల్కపల్లి నుంచి గెలిచిన పద్మావతి జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కాగా, అధిక సంతానం కేసులో అనర్హత వల్ల పదవికి దూరమయ్యారు. కోర్టు తీర్పుతో అక్కడి కాంగ్రెస్ అభ్యర్థి జడ్పీటీసీగా గెలిచినట్లు ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ బలం నాలుగుకు చేరింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ అచ్చంపేట, ఉప్పునుంతల, పెద్దకొత్తపల్లి, బిజినేపల్లి జడ్పీటీసీలతో పాటు మరి కొందరు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో జడ్పీలో కాంగ్రెస్ బలం 11కు చేరింది. ఎక్స్అఫిషియో సభ్యులుగా నలుగురు ఎమ్మెల్యేలతో కలిపి అవిశ్వాసం పెట్టేందుకు సంఖ్యా బలం ఉన్నా సముఖంగా లేదని తెలుస్తోంది. కొల్లాపూర్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరులు 11 వార్డుల్లో గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 9 వార్డుల్లో గెలిచారు.
ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డిని ఎక్స్ అఫిషియో సభ్యులుగా నామినేట్ చేయించి వారి సపోర్ట్‌తో మున్సిపల్ చైర్మన్ కుర్చీ సాధించుకుంది. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి జూపల్లి మంత్రిగా ప్రమాణం చేయడంతో కొల్లాపూర్ మున్సిపాలిటీలో అవిశ్వాసం పెడతారనే చర్చ మొదలైంది. మరో ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో కాంగ్రెస్ బలం 13కు చేరింది. ఇక్కడ చైర్మన్‌ను మార్చేందుకు పూర్తిగా అవకాశాలున్నాయి. అచ్చంపేటలో 20 వార్డులు ఉండగా, కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూ కడుతున్నా ఎమ్మెల్యే వంశీకృష్ణ తిరస్కరిస్తున్నట్లు సమాచారం.
అన్ని స్థానాలు మావే..
మూడు నెలల కోసం దింపేశామనే బద్నాం ఎందుకు మోయాలని డీసీసీ అధ్యక్షుడు డా.వంశీకృష్ణ ప్రశ్నిస్తున్నారు. జడ్పీ, ఎంపీపీ స్థానాలతో పాటు నాలుగు మున్సిపాలిటీలను క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతామని వస్తున్నారని, అయితే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినా పార్టీనే నమ్ముకుని ఉన్నవాళ్లను కాపాడుకోవడమే తమకు ముఖ్యమన్నారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారని, అలంపూర్, గద్వాలలో పట్టు సాధించడం తమకు పెద్ద పని కాదని అంటున్నారు.