హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం : వర్రె వెంకటేశ్వర్లు

కోదాడ, వెలుగు : కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ హక్కులను కాలరాస్తోందని సమాచార హక్కు మాజీ ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో శుక్రవారం కోదాడలో సమాచార హక్కు కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చిందన్నారు.

ఈ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి బాగా తగ్గిందన్నారు. అదేవిధంగా యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాహక్కు చట్టం, జాతీయ, గ్రామీణ ఉపాధి చట్టం వంటివి పకడ్బందీగా అమలు అవుతున్నాయని తెలిపారు. కానీ, కేంద్ర ప్రభుత్వం చట్టాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. చట్టంలో సవరణ లు చేసి పారదర్శకత లేకుండా చేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్రం లో సమాచార కమిషనర్లను నియమించకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ పరిస్థితుల్లో రాబోయే లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరమన్నారు. మేధావులు, ఉద్యోగులు, జర్నలిస్టులు అందరూ ఏకతాటిపై వచ్చి కేంద్రంఆగడాలను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.  సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే కోదాడలో సమాచార హక్కు చట్టంపై భారీ స్థాయిలో సభ నిర్వహిస్తామని

సభకు జిల్లా మంత్రులతో స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ని ఆహ్వానిస్తామని తెలిపారు. సమావేశంలో సమాచార హక్కు వికాస సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రమాద కృష్ణారెడ్డి, నాయకులు గంధం పాండు, ఏసు పాదం, మజాహర్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.