గద్దర్ కు ఏ అవార్డూ సాటిరాదు : డాక్టర్ వెన్నెల 

గద్దర్ కు ఏ అవార్డూ సాటిరాదు : డాక్టర్ వెన్నెల 
  • తెలంగాణ సమాజాన్ని కించపర్చేలా బండి సంజయ్ వ్యాఖ్యలు 
  • తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల 

మాదాపూర్, వెలుగు:   ప్రజా యుద్ధనౌక గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని కించపర్చేలా ఉన్నాయని సాంస్కృతిక సారథి చైర్ పర్సన్ డాక్టర్ వెన్నెల అన్నారు. పద్మ అవార్డుల గురించి మాట్లాడేటప్పుడు తన అభిప్రాయాన్ని ఆయన చెప్పొచ్చని, కానీ కేంద్ర మంత్రిగా బాధ్యత గల పదవిలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. మంగళవారం హైదరాబాద్ మాదాపూర్ లోని తెలంగాణ సాంస్కృతిక సారథి ఆఫీస్ లో ఆమె మీడియాతో మాట్లాడారు.

‘‘గద్దరన్న ముందు ఏ అవార్డు అయినా తక్కువే. ప్రజలే ఆయనను ‘ప్రజా యుద్ధనౌక’ అంటూ గౌరవించారు. అయితే, గద్దర్ కు పద్మ అవార్డులు వస్తే గౌరవంగా భావిస్తాం. భవిష్యత్తు తరాల వారికి కూడా స్ఫూర్తిగా ఉంటుంది” అని ఆమె స్పష్టం చేశారు. పద్మ అవార్డుల విషయంలో కేంద్రం తీరుపై సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం గజ్జెకట్టి ఆడి, పాడి.. పోరాడిన గద్దరన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ‘‘గద్దర్ కేవలం ఒక వ్యక్తి కాదు, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు.

కచ్చితంగా ఈ విషయంపై స్పందించాలని రెండు రాష్ట్రాల నుంచి అనేక మంది నాకు ఫోన్లు చేశారు. గద్దర్ కుమార్తెగా నేను మౌనంగానే ఉన్నా. కానీ బాధ్యత గల సాంస్కృతిక సారథి చైర్మన్ గా స్పందిస్తున్నా” అని తెలిపారు. గద్దర్ కుమార్తెగా మాట్లాడితే ఇంకోలా ఉండేదన్నారు. ‘‘గద్దర్ కు పద్మ అవార్డులు ఇవ్వబోమని బండి సంజయ్ అన్నారు. ఎందుకివ్వరు? ఆ అవార్డులను బీజేపీ నేతల ఇంట్లో నుంచి ఇస్తున్నారా?” అని వెన్నెల ఫైర్ అయ్యారు.

బీజేపీ కార్యకర్తలను గద్దర్ చంపించారని అన్న బండి సంజయ్ ఆధారాలతో నిరూపించాలని..  లేకపోతే క్షమాపణలు చెప్పాలన్నారు. గతంలో బీజేపీ అగ్ర నేతలెందరో గద్దర్ ను కలిశారని గుర్తు చేశారు. ఒక గొప్ప వ్యక్తి గురించి చనిపోయిన తర్వాత ఇలా మాట్లాడటం దారుణమన్నారు.