2027 టార్గెట్‎తో విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నం: డిప్యూటీ సీఎం భట్టి

  • అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్
  • 2027 టార్గెట్​తో రూపొందిస్తున్నం: డిప్యూటీ సీఎం భట్టి
  • 2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్లాన్ 
  • యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లతో ప్రజలపై 14 వేల కోట్ల అదనపు భారం 
  • గత బీఆర్ఎస్ సర్కార్ అధిక రేటుకు టెండర్లు ఇవ్వడం,నిర్మాణాల్లో జాప్యం చేయడమే కారణం 
  • నేటి నుంచి యాదాద్రి కొత్త యూనిట్​లో కరెంట్ ఉత్పత్తి  
  • గృహజ్యోతితో 49 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్–-2027 తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం సెక్రటేరియెట్​లో భట్టి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజలపై వేల కోట్ల భారం మోపిందని ఆయన మండిపడ్డారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ల టెండర్లను అధిక రేటుకు ఇవ్వడం, నిర్మాణాల్లో జాప్యం చేయడంతో రానున్న 25 ఏండ్లలో ప్రజలపై రూ.14,140 కోట్ల అదనపు భారం పడనుందని తెలిపారు. ‘‘యాదాద్రి పవర్ ప్లాంట్ టెండర్ ను అధిక రేటుకు కట్టబెట్టడంతో కరెంట్ ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత పాతికేళ్లలో రాష్ట్రంపై రూ.9,697 కోట్ల అదనపు భారం పడనుంది.

రామగుండంలో ఎన్టీపీసీ రెండోదశ ప్లాంట్ నిర్మాణానికి నాటి బీఆర్ఎస్​ ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో నష్టం జరిగింది. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఏడేండ్లకు పైగా ఆలస్యం కావడంతో అంచనా వ్యయం రూ.7,290 కోట్ల నుంచి రూ.10,515 కోట్లకు పెరిగింది. దీని కారణంగా నూ పాతికేళ్లలో ప్రజలపై రూ.4,443 కోట్ల అదనపు భారం పడనుంది. గత బీఆర్ఎస్ సర్కార్ చత్తీస్ గఢ్ తో వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుని, 2 వేల మెగావాట్ల కరెంట్ సరఫరాకు కారిడార్ బుక్ చేసుకుంది. 

దీనివల్ల రూ.638.50 కోట్ల అదనపు భారం పడింది. చత్తీస్ గఢ్ కరెంటును వదులుకున్నందుకు మరో రూ.261.34 కోట్ల రిలిక్విష్మెంట్ చార్జీలను విధిస్తే, వాటిని కట్టలేమంటూ కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి(సీఈఆర్సీ)లో తెలంగాణ డిస్కంలు కేసు వేశాయి. అదింకా తేలలేదు” అని చెప్పారు. “యాదాద్రి పవర్ ప్లాంట్ చాలా గొప్పగా నిర్మించామని బీఆర్ఎస్ చెబుతున్నది. కానీ వాళ్లు పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదు. మేం వచ్చాకే పర్యావరణ అనుమతులు తెచ్చాం. శనివారం నుంచి యాదాద్రిలోని 800 మెగావాట్ల కొత్త యూనిట్ లో కరెంటు ఉత్పత్తి చేసి గ్రిడ్ కు అనుసంధానిస్తాం” అని వెల్లడించారు. 

అప్పుల చెల్లింపులకు మళ్లీ అప్పులు.. 

ఏడాది కాలంలో ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామని భట్టి తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి పథకంతో 49.71 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ అందుతున్నదని చెప్పారు. ‘‘తెలంగాణలో రోజువారీ విద్యుత్ డిమాండ్ అత్యధికంగా 15,623 మెగావాట్లు ఉంది. ఇది 2030 నాటికి 22,448 మెగావాట్లకు, 2035 నాటికి 31,891 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. 2035 నాటికి మొత్తం 40 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని అదనంగా ఉత్పత్తి చేయాలని ప్రణాళికలను తయారు చేస్తున్నాం. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తాం’’ అని చెప్పారు. 

అప్పులు చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితిని గత బీఆర్ఎస్​ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. ‘‘మేం అధికారంలోకి వచ్చాక రూ.52,118 కోట్ల అప్పులు తెచ్చాం. అదే టైమ్ లో బీఆర్ఎస్​ప్రభుత్వం తెచ్చిన అప్పులకు కిస్తీలుగా రూ.64,516 కోట్లు చెల్లించాం. రూ.24 వేల కోట్లను మూలధన వ్యయం కింద, రూ.61,194 3 కోట్లను సంక్షేమానికి ఖర్చు పెట్టాం. జీతాలు, పింఛన్లకు రూ.60 వేల కోట్లు చెల్లించినం” అని వెల్లడించారు. ఆర్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన బీఆర్ఎస్​నేతలు.. ఇప్పుడు తమ ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.