- సిటీలో మెయిన్ రోడ్ల నుంచి కాలనీల వరకు ఇదే పరిస్థితి
- ఫిర్యాదులు వస్తున్నా స్పందించని వాటర్ బోర్డు
- దుర్వాసన భరించలేకపోతున్న జనం
- రోడ్లపై మురుగు పారుతుండటంతో ట్రాఫిక్ స్లో
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్ లో మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు అంతగా పడకపోయినా కూడా మ్యాన్ హోల్స్ పొంగుతున్నాయి. మెయిన్ రోడ్లపై నుంచి కాలనీలు, బస్తీలు రోడ్ల దాకా ఇదే పరిస్థితి ఉంది. కొన్ని జంక్షన్ల వద్ద సిగ్నల్ పడినప్పుడు బైక్ లను ఆపి కాలు కింద పెడదామన్నా పెట్టలేకుండా వరద నిలిచి ఉంటోంది. నానల్ నగర్ లాంటి జంక్షన్ వద్ద తరచూ మ్యాన్ హోల్స్ పొంగి రోడ్డుపై మురుగంతా పారుతుండడంతో వెహికల్స్ నెమ్మదిగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. సీవరేజ్ వాటర్ లీకేజీ కారణంగా ట్రాఫిక్ స్లో అవుతోందని కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ పోలీసులు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఇంకొన్నిచోట్ల కార్లు స్పీడ్ గా వెళ్తుండగా బైక్ లపై వెళ్తున్న వారిపై మురుగు పడుతోంది.
దీంతో వాహనదారుల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. సిటీలో దశాబ్దాల కిందట నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ కావడంతో పైప్ లైన్లు ప్రస్తుత కెపాసిటీని తట్టుకోలేకపోతుండడమే మ్యాన్ హోల్స్ పొంగిపొర్లేందుకు కారణమంటూ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ప్రతి ఏటా కొన్ని ప్రాంతాల్లో పనులు చేసి ఉంటే ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదని పేర్కొంటున్నారు. దీనిపై వాటర్ బోర్డు దృష్టిపెట్టకపోవడంతోనే సిటీలో మురుగు పారే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం వస్తున్న ఫిర్యాదుల్లో సీవరేజీ ఓవర్ ఫ్లో వే ఎక్కువగా ఉంటున్నా స్పందించడం లేదు.
రూ. కోట్లలో ఖర్చు చేస్తున్నా..
డ్రైనేజీ పైప్ లైన్ల రిపేర్లు, మెయింటెనెన్స్పేరుతో ప్రతినెల రూ. కోట్లలో వాటర్ బోర్డు ఖర్చు చేస్తోంది. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. వర్షపు నీటితో మ్యాన్ హోల్స్నిండిపోయి తరచూ పొంగడం కామన్ అనే విధంగా అధికారుల తీరు ఉంటోందని జనం మండిపడుతున్నారు.
ఈ ఏడాది సమ్మర్లోనే చర్యలు తీసుకుని ఉంటే వానాకాలంలో ఇబ్బందులు తప్పేవని, ప్రస్తుతం భారీ వర్షాలు పడితే మ్యాన్ హోల్స్ పొంగి దారుణ పరిస్థితులు నెలకొంటాయని జనం భయాందోళనకు గురవుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిటీలో డ్రైనేజీ సిస్టం లేదని.. అవసరమైన ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా వెంటనే పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
తరచూ ఇబ్బందులు
వాటర్ బోర్డు పరిధిలో 200కు పైగా ప్రాంతాల నుంచి రెగ్యులర్ గా అధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కోచోట 10 నుంచి 15 రోజులుగా మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సిటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీహెచ్ఈఎల్, సోమాజిగూడ, నానల్‌నగర్, మాసబ్ ట్యాంక్, లక్డీకపూల్, టోలిచౌకి, అల్వాల్, లంగర్ హౌస్, చాంద్రాయణగుట్ట, ఆర్కేపురం, ఉప్పల్, మౌలాలితదితర ప్రాంతాల్లో ఎక్కువగా మ్యాన్ హోల్స్పొంగిపొర్లుతున్నాయి.
రోడ్లపై రోజుల తరబడి మురుగు పారుతుండగా వాటర్ బోర్డు ట్విట్టర్, గ్రీవెన్స్ సెల్ కి జనం ఫిర్యాదులు చేస్తున్నారు. మరోసారి ఇబ్బందులు లేకుండా ఉండేలా పకడ్బందీగా పనులు చేయకపోవడంతో తరచూ సమస్య ఏర్పడుతోందని మండిపడుతున్నారు.
భారీ వానలు పడితే..
వానలు పడనప్పుడే సిటీలో పరిస్థితి ఇలా ఉంటే, ఇక వర్షాలు పడితే మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతుంటాయి. వరద మురుగునీటిలో కలిసిపోతుంది. రోడ్లపై వెళ్లే జనం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్నిచోట్ల నిత్యం సమస్య ఉంటుండగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో జంక్షన్ల వద్ద పోలీసులు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. నానల్ నగర్ జంక్షన్ వద్ద మ్యాన్ హోల్స్ ఓవర్ ఫ్లో అవుతుంది.
ఈ మధ్య నెలరోజుల్లో మూడుసార్లు ఇదే సమస్య తలెత్తింది. దీంతో అక్కడ ట్రాఫిక్ స్లోగా సాగుతుంది. బీహెచ్ఈఎల్ వద్ద కూడా వానలు కురిసినప్పుడు నిలిచిన మురుగు నీరు రోడ్లపై పారింది . ఇలా అనేక ప్రాంతాల్లో ఇదే సమస్య ఏర్పడుతోందని స్థానిక జనం వాపోతున్నారు.