కంపుకొడ్తున్న జీజీహెచ్ ..  అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ

నిజామాబాద్,  వెలుగు:  నిజామాబాద్​ మెడికల్ ​కాలేజీకి అనుబంధంగా నడుస్తున్న గవర్నమెంటు జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్​)లో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. మెడికల్ ​కాలేజీని కట్టినప్పుడే హాస్పిటల్ ​కోసం కొత్త బిల్డింగ్​కట్టారు. ఆధునిక హంగులతో హాస్పిటల్ కోసం ఏడంతస్తుల బిల్డింగ్​ కట్టినా టాయ్​లెట్లు, వాష్​రూమ్​లు.. డ్రైనేజీ వ్యవస్థ  దారుణంగా ఉంది. ఆస్పత్రిలోని వార్డులన్నీ  కంపు కొడుతున్నాయి.   జీజీహెచ్​కు రోజూ  దాదాపు2,500 మంది వరకు  అవుట్​ పేషెంట్లు వస్తుంటారు.  ఇన్​ పేషెంట్ల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. 750 పడకలకు సాంక్షన్​ ఉన్నా  రోగుల రాక ఎక్కువ కావడంతో బిల్డింగ్​లో ఖాళీగా ఉన్న  గదులను కూడా వార్డులుగా  మార్చి మొత్తం  1,300 పడకలను  ఏర్పాటు చేశారు.

పేషెంట్లు,  వారి సహాయకులు,  డాక్టర్లు, సిబ్బందితో కలిసి రోజు దాదాపు 6  వేల మందికి తగ్గకుండా హాస్పిటల్​కు వచ్చివెళ్తుంటారు.   ఇన్​ పేషెంట్లు, వారి అటెండెంట్లు దాదాపు 3 వేల మంది వరకు ఉంటారు. వీరి అవసరాలకు తగ్గట్టు   మరుగు దొడ్లు, బాత్​రూమ్​లు ఏర్పాటు చేయలేదు.  హాస్పిటల్​, దాని పరిసరాలు  పరిశుభ్రంగా  ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి  పరిస్థితి లేదు.  డ్రైనేజీ పైప్​లైన్లు  పగిలిపోయి మురుగునీరు లీక్​ అవుతోంది. దీంతో బిల్డింగ్​ వెనుకవైపు  గోడంతా మురుగునీటితో తడిసి ఫ్లోర్లలో భరించరాని దుర్వాసన  వ్యాపిస్తోంది.

 వాసన భరించలేక పేషెంట్లు నానా అవస్థలు పడుతున్నారు.  రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు తాత్కాలిక రిపేర్ల చేయించి నెట్టుకొస్తున్నారు.  పెండింగ్​లో ప్రపోజల్స్​హాస్పిటల్​ డ్రైనేజీ సిస్టమ్​ పూర్తిగా మార్చాలని టీఎస్​ఎంఎస్​ఐడీసీ ఇంజనీర్లు చెప్తున్నారు. ఈమేరకు రూ. 1 కోటి 60 లక్షలతో ప్రపోజల్స్​ తయారు చేసి  వైద్య శాఖ మంత్రి హరీశ్​ ​రావుకు పంపారు.   ఇంతవరకు  ఫండ్స్​  సాంక్షన్​కాలేదు.