వరంగల్‌లో కాల్వల్లేక ఇండ్లలోకి డ్రైనేజీ వాటర్​!

 వరంగల్‌లో కాల్వల్లేక  ఇండ్లలోకి డ్రైనేజీ వాటర్​!
  • రోడ్లేసి చేతులు దులుపుకొన్న ఆఫీసర్లు
  • డ్రైనేజీలు లేక కాలనీల్లోనే నిలిచి ఉంటున్న మురుగునీళ్లు
  • మంత్రి మాటిచ్చినా తీరని సమస్య
  • వరంగల్ లో ఇండ్లు అమ్మకానికి పెడుతున్న బాధితులు

హనుమకొండ, వెలుగు: స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతున్న వరంగల్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. రోడ్లేసి చేతులు దులుపుకొంటున్న ఆఫీసర్లు సైడ్ కాల్వలను పట్టించుకోకపోవడం సమస్యగా మారుతోంది. దీంతో మురుగునీళ్లన్నీ ఇండ్ల మధ్యలో నిలిచి జనాలు అవస్థలు పడుతున్నారు. నగరంలోని వందలాది కాలనీల్లో ఇదే సమస్య ఉండగా.. వరంగల్ రంగశాయిపేట తెలంగాణ కాలనీలో మురుగునీళ్లు ఇండ్లలోకి చేరుతున్నాయి. మంత్రి కొండా సురేఖ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చినా.. ఆఫీసర్లు లెక్కచేయకపోవడం, మురుగు నీళ్లతో ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో అక్కడి జనాలు కొందరు ఇండ్లను ఖాళీ చేసి వెళ్తున్నారు మరికొందరు ఏకంగా ఆ ఇండ్లనే అమ్మేస్తున్నారు. 

ఇండ్లు విడిచిపోతున్న జనాలు

గ్రేటర్ వరంగల్ పరిధిలోని 66 డివిజన్లలో ఇప్పటికే 2.25 లక్షల ఇండ్లు ఉండగా.. ఏటా 6 వేల వరకు కొత్త కన్ స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. విస్తరిస్తున్న కాలనీలకు అనుగుణంగా డ్రైనేజీ సిస్టం లేకపోవడం సమస్యగా మారుతోంది. నగరంలో చాలాచోట్లా మురుగునీళ్లు రోడ్లపై పారుతున్నాయి. రంగశాయిపేట, రాములవారి గుడి కాలనీ, పెరుక వాడ, ఉప్పరి కాలనీ, ఎస్సీ కాలనీ, సాయి నగర్ కాలనీ తదితర ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న మురుగునీరు బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు లేకపోవడంతో నీళ్లన్నీ ఇండ్ల మధ్యనే నిలిచి ఉంటున్నాయి.

 దాదాపు పదేండ్ల కిందటే కాలనీ ఏర్పాటైనా డ్రైనేజీ సిస్టం సరిగా మురుగునీళ్లన్నీ ఇండ్లలోకి చేరుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడి ఇండ్లన్నీ డ్రైనేజీ వాటర్​ తో నిండిపోతున్నాయి. ఇక్కడ దాదాపు వెయ్యికి పైగా ఇండ్లు ఉండగా.. స్థానికులు పలుమార్లు సమస్యను స్థానిక కార్పొరేటర్​ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించారు. అయినా ఫలితం ఉండటం లేదు. 

మంత్రి మాటిచ్చినా కదలని అధికారులు

వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, స్థానిక మంత్రి కొండా సురేఖ ఎన్నికల్లో గెలిచిన తరువాత తెలంగాణ కాలనీని సందర్శించారు. ఆ సమయంలో స్థానికులు సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే పరిష్కరించాల్సిందిగా జీడబ్ల్యూఎంసీ అధికారులను ఆదేశించారు. కానీ ఆ తరువాత అధికారులు సరిగా స్పందించకపోవడం, డ్రైనేజీ వాటర్​ బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయకపోవడంతో ఇక్కడి జనాలు ఇబ్బందులు పడక తప్పడం లేదు.  కాలనీల్లో అవుట్​ ఫ్లో ఏర్పాట్లు లేకపోవడంతో మురుగునీళ్లన్నీ కాలనీలోనే నిలిచి ఉంటోంది. ఫలితంగా మురుగునీరంతా   ఇండ్ల మధ్య నిలిచి దోమలు, విష పురుగులతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు, అధికారులు 
స్పందించిన తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి 
చేస్తున్నారు.

ALSO READ : అధ్వానంగా రైతు వేదికలు ..​ కరెంట్ కట్​ అవ్వడంతో రైతు నేస్తం కు ఆటంకం

ఇండ్లు అమ్ముకుని పోతున్నరు

చుట్టుపక్కల పది కాలనీల నుంచి మురుగునీళ్లన్నీ ఇక్కడికే వస్తున్నాయి. ఇక్కడి నుంచి బయటకు వెళ్లే మార్గం లేక ఇండ్ల మధ్యనే డ్రైనేజీ జామ్​ అవుతోంది. ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఇబ్బందులు పడలేక ఇక్కడ చాలామంది ఇండ్లు అమ్ముకుని వెళ్లిపోతున్నారు. కొంతమంది బయట అడుగు పెట్టలేక ఇండ్లలోనే ఉంటున్నారు.

పెద్ది ఎల్లయ్య, తెలంగాణ కాలనీ

 పట్టించుకుంటలేరు

ఇండ్లళ్లకు మురుగునీళ్లు వస్తున్నాయని, దోమలు, విషపురుగులతో ఇబ్బందులు పడుతున్నామని చాలాసార్లు ఫిర్యాదు చేశాం. కార్పొరేటర్​ నుంచి మంత్రి దాకా అందరికీ వినతిపత్రాలు ఇచ్చాం. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. వినతిపత్రాలు ఇచ్చిన సందర్భంలో మున్సిపల్​ సిబ్బంది వచ్చిపోవడం తప్ప సమస్య పరిష్కారానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. 

దొంతురాల నర్సయ్య, స్థానికుడు