- తాగే నీటిలో కలిసిన డ్రైనేజీ వాటర్.. 350 మందికి అస్వస్థత
- సికింద్రాబాద్ లోని చింతబావి బస్తీలో ఘటన
- మూడ్రోజులుగా కలుషిత నీళ్లు వస్తున్నా పట్టించుకోని అధికారులు
- నాయకులు, ఆఫీసర్లపై స్థానికుల ఆగ్రహం
- నల్లా నీళ్లు ఆపేసి ట్యాంకర్ల ద్వారా సరఫరా
సికింద్రాబాద్, వెలుగు: నల్లా నీళ్లలో డ్రైనేజీ నీళ్లు కలవడంతో, అవి తాగి న 350 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్ మెట్టుగూడలోని చింతబావి బస్తీ లో జరిగింది. ఈ బస్తీకి మంగళవారం నుంచి కలు షిత నీళ్లు సరఫరా అవుతున్నాయి. అవి పట్టుకొని తాగిన బస్తీవాసులు అనారోగ్యానికి గురయ్యారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. మొదటి రోజు దాదాపు వంద మంది, రెండోరోజు బుధవారం మరో వంద మంది, మూడో రోజు గురువారం మరో 50 మంది అస్వస్థతకు గురయ్యారు.
వీళ్లందరూ స్థానిక యూపీహెచ్ సీ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్ మెంట్ తీసుకున్నారు. వాంతులు, విరేచనాలు ఎక్కువైన కొందరిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, టెస్టులు చేసి మందులు ఇచ్చి పంపించారు. కాగా, మూడ్రోజులుగా కలుషిత నీళ్లు సరఫరా అవుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోలేదు. గురువారం స్థానికులు ఆందోళన చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీనిపై వార్తలు రావడంతో వాటర్ బోర్డు అధికారులు హుటాహుటిన బస్తీలో పర్యటించారు. నల్లా నీళ్ల సరఫరాను ఆపేసి, ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తున్నారు. నీటి కాలుష్యానికి గల కారణాలు తెలుసుకొని, చర్యలు తీసుకుంటామని జలమండలి తార్నాక మేనేజర్ -నిఖిత తెలిపారు.
వారం సంది చెబుతున్నా...
చింతబావి ప్రాంతంలో ఏండ్ల కింద వేసిన మంచినీటి పైప్ లైన్ కు రిపేర్లు చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రైనేజీ, మంచినీటి పైప్ లైన్లు కలిసిన చోట... డ్రైనేజీ నీళ్లు మంచినీటి పైప్ లైన్లలో చేరి సరఫరా అవుతున్నాయి. కొద్ది రోజులుగా నీళ్లు దుర్వాసన వస్తున్నాయని అధికారులకు స్థానికులు ఫిర్యాదు కూడా చేశారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. వారం రోజులుగా చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మంది అస్వస్థతకు గురైనా ప్రజాప్రతినిధులు, లీడర్లు ఎవరూ రాలేదని మండిపడ్డారు. ‘‘టీవీల్లో వార్తలు చూసి కార్పొరేటర్ సునీత గురువారం బస్తీలో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. లోకల్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ దగ్గరికి వెళ్తామంటే వద్దన్నారు. తాను చూసుకుంటానని చెప్పారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్యేను కలుద్దామని పోతే అక్కడున్నోళ్లు కలువనియ్యలేదు” అని ఫైర్ అయ్యారు.
9 నెలల బాబు ఆస్పత్రిలో.. కలుషిత నీళ్లతో మా ఇంట్లో అం దరం అనారోగ్యం పాలైనం. 9 నెలల బాబును ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించినం. ట్రీట్ మెంట్ జరుగుతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇట్ల జరిగింది.
- మంజుల, చింతబావి బస్తీ
అధికారులు పట్టించుకోలే..
కొద్ది రోజులుగా నల్లా నీళ్లు వాసన వస్తున్నాయని చెప్పినా సార్లు పట్టించుకోలేదు. మూడ్రోజులుగా దుర్వాసన మరీ ఎక్కువైంది. ఆ నీళ్లు తాగడంతో వాంతులు మొదలయ్యాయి.
- విజయలక్ష్మి, బాధిత మహిళ
ట్రీట్ మెంట్ చేస్తున్నం..
చింతబావి బస్తీకి చెందిన పలువురు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రికి వచ్చారు. రెండ్రోజులుగా 88 మందికి ట్రీట్ మెంట్ ఇచ్చాం. ఎవరికీ సీరియస్ లేదు. అందరికీ మందులు ఇచ్చి పంపించాం.
- డాక్టర్ పవన్‌కుమార్‌రెడ్డి, యూపీహెచ్సీ, మెట్టుగూడ