
- కారుతో బీభత్సం.. వెంబడించి పట్టుకున్న పోలీసులు
జీడిమెట్ల, వెలుగు: నిద్రమాత్రల మత్తులో ఓ వ్యక్తి కారుతో జగద్గిరిగుట్ట బస్‌స్టాప్ వద్ద బీభత్సం సృష్టించాడు. అక్కడ ఆగకుండా వెళ్తూ అనంతరం బాలానగర్ డీసీపీ ఆఫీస్ వద్ద మరో టూ వీలర్‌ను ఢీ కొట్టాడు. అక్కడి నుంచి వెళ్లి షాపూర్‌నగర్ మార్కెట్లో ఓ కారును ఢీ కొట్టాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గుండ్ల పోచంపల్లికి చెందిన అంబు సోమశేఖర్ (48)బిజినెస్ చేస్తుంటాడు. గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో హోండా సిటీ కారువేగంగా నడుపుతూ జగద్గిరిగుట్ట బస్‌స్టాప్ వద్ద బీభత్సం గా డ్రైవ్ చేశాడు.
గాజులరామారం చౌరస్తాలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై సందీప్ పోలీసు సిబ్బందిని అలర్ట్ చేసి.. సోమశేఖర్‌ను వెంబడించి సూరారం వద్ద పట్టుకున్నారు. ఆ సమయంలో అతడు మత్తులో ఉన్నాడు. డ్రంకన్ టెస్ట్ నిర్వహిచంగా అతడు మద్యం తాగలేదని తేలింది. దీంతో అతని భార్యకు సమాచారం ఇవ్వగా అతడు నిద్రమాత్రలు వేసుకునే అలవాటు ఉందని తెలపడంతో అతన్ని సూరారం పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.