ఇల్లు అమ్మి అతుకుల్లేని జెండా చేసిండు

ఇల్లు అమ్మి అతుకుల్లేని జెండా చేసిండు
  • రుద్రాక్షల సత్యనారాయణను అభినందించిన రాష్ట్రపతి
  • ఎర్రకోటపై ఎగిరేలా చూస్తానని హామీ

న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచంలోనే తొలి అతుకులు, కుట్లు లేని జాతీయ జెండాను తయారు చేసిన రుద్రాక్షల సత్యనారాయణ(ఏపీ)ను రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము అభినందించారు. ఆయన చేసిన జెండానే ఎర్రకోటపై ఎగిరేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వేమవరానికి చెందిన చేనేత కార్మికుడైన రుద్రాక్షల సత్యనారాయణకు మువ్వన్నెల జెండా అంటే ఎంతో అభిమానం. ఎర్రకోటపై తాను తయారు చేసిన జెండానే ఎగరాలని అనుకున్నాడు. అందుకు దేశంలో ఇంతవరకు ఎవ్వరూ తయారు చేయని విధంగా ఎలాంటి అతుకులు, కుట్లు లేని జెండాను రెడీ చేయాలని నిర్ణయించుకున్నాడు. 

ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో తన కల కోసం ఏకంగా ఇంటినే అమ్మేశాడు. దాదాపు నాలుగైదేండ్లు కష్టపడి తాను అనుకున్న జెండాను తయారు చేశాడు. సోమవారం ఢిల్లీలో రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రు తెజావత్, సినీ నటి పూనం కౌర్ తో కలిసి సత్య నారాయణ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. తాను తయారు చేసిన జెండా ప్రత్యేకతలను ఆమెకు వివరించారు.  ఈ సందర్భంగా సత్యనారాయణ ప్రతిభ, అంకుటిత దీక్షను ముర్ము అభినందించారు. అనంతరం సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..పింగళి వెంకయ్య స్ఫూర్తితోనే అతుకులు లేని జాతీయ జెండా(8x12 సైజ్)ను రూపొందించినట్లు చెప్పాడు. దాన్ని ఎర్రకోటపై ఎగురవేసే అంశంతో పాటూ, తనను ఆర్థికంగా ఆదుకోవాలని అధికారులను రాష్ట్రపతి ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. 

ఇది దేశం గర్వించే జెండా..

ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో ఏకవస్త్ర జాతీయ జెండాను తయారు చేయడం గర్వకారణమని నటి, ఏపీ చేనేత అంబాసిడర్ పూనం కౌర్ అన్నారు. సత్యనారాయణ రూపకల్పన చేసిన జెండా దేశం గర్వించే జెండా అని అభిప్రాయపడ్డారు. దీనికి ఆయన రాత్రింబవళ్లు శ్రమించారని చెప్పారు. ఈ జెండా తయారీకి అయ్యే ఖర్చును తానే భరిస్తానని కోరితే సత్య నారాయణ నిరాకరించారని గుర్తుచేశారు. చేనేత మగ్గంపై దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని చాటిన సత్య నారాయణను మరింత ప్రోత్సహించాలని కోరారు.  

చేనేతపై ఉన్న మక్కువతో తాను దేశంలోని అనేక ప్రాంతాలను సందర్శించినట్లు చెప్పారు. చేనేత రంగం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని పూనం కౌర్ పేర్కొన్నారు. రామచంద్రు తెజావత్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎర్రకోటపై ఎగురవేస్తోన్న జెండా కర్నాటకలో తయారవుతోందని తెలిపారు. ఆ జెండాకు ఐఎస్ఐ ముద్ర, ఇతర నిబంధనలు ఉంటాయన్నారు. రాష్ట్రపతి ఇచ్చిన హామీతో త్వరలో తెలుగు ప్రాంతానికి చెందిన సత్యానారాయణ తయారు చేసిన ఏకవస్త్ర జెండా ఎర్రకోటపై రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.