![ముర్ముకు సురినామ్ పౌర పురస్కారం..140 కోట్ల మందికి గౌరవం](https://static.v6velugu.com/uploads/2023/06/Draupadi-Murmu-was-awarded-the-Suriname-Award_ivcaNW4MEZ.jpg)
పరమారిబో: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. ‘గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ద చైన్ ఆఫ్ ది ఎల్లో స్టార్’ అవార్డును సురినామ్ ప్రెసిడెంట్ చంద్రికా పర్సాద్ సంతోఖి.. ముర్ముకు అందజేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను గౌరవిస్తూ ముర్ముకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈమేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఈ సందర్భంగా సంతోఖి, సురినామ్ ప్రభుత్వానికి ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డుతో ఇండియాలోని 140 కోట్ల మందికీ గౌరవం లభించిందన్నారు. దేశ ప్రజలకు ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని తెలిపారు. సురినామ్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న రాష్ట్రపతికి ప్రధాని మోడీ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. కాగా, ముర్ము ఈ నెల 4 నుంచి 6 వరకు సురినామ్లో పర్యటించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి విదేశీ పర్యటన ఇదే!