రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము ఎంపిక సరైనదే

రాష్ట్రపతి అభ్యర్థిగా ముర్ము ఎంపిక సరైనదే

భారత రాజ్యాంగం ప్రకారం దేశ రాష్ట్రపతే రాజ్య వ్యవస్థకు సర్వాధికారి, దేశ ప్రథమ పౌరుడు. ఆర్మీ వ్యవస్థను ముందుకు నడిపించే సుప్రీం కమాండర్. రాష్ట్రపతిని, పార్లమెంటు ఉభయసభల సభ్యులు, రాష్ట్రాల శాసన సభల సభ్యులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎలక్టెడ్ సభ్యులు ఎలక్టోరల్ కాలేజీ ద్వారా పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. భారత రాజ్యాంగంలోని 56వ అధికరణ ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ఐదేండ్లు పదవిలో ఉంటారు.1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు13 మంది రాష్ట్రపతులుగా సేవలందించారు. ప్రస్తుతం14వ రాష్ట్రపతిగా ఉత్తరప్రదేశ్ కు చెందిన రామ్​నాథ్ కోవింద్ బాధ్యతల్లో ఉన్నారు. జులై 24తో ఆయన పదవీ కాలం ముగియనుంది.
 

బీజేపీ యేతర శక్తుల ఐక్యత?
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టీఆర్ఎస్ ​తదితర పార్టీలు రాష్ట్రపతి ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకొని జాతీయ స్థాయిలో బీజేపీ యేతర రాజకీయ శక్తులను ఏకం చేసి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక బలమైన సంకేతం పంపాలని ప్రయత్నించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్​ఏకంగా ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో స్వయంగా పర్యటించి ఆయా రాష్ట్రాల సీఎంతో మంతనాలు జరిపారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నిలబడగలిగే ధైర్యం తనకే ఉందనే స్థాయిలో ప్రచారం చేసుకున్నారు. కానీ ఆయన ఊహించినట్టుగా అటువైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీలు పలు బీజేపీ యేతర పార్టీలతో చర్చలు జరిపాయి. అందులో భాగంగానే మొదటగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్​ను, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీనేత ఫారూఖ్ అబ్దుల్లాను, గాంధీ మనుమడైన గోపాల కృష్ణ గాంధీలను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడాలని కోరారు. చివరకు బీజేపీ మాజీ లీడర్​ యశ్వంత్ సిన్హాను విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టారు. 
 

అనూహ్య నిర్ణయంతో..
ఒడిశాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును ఎన్​డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసిన బీజేపీ ఆమెతో నామినేషన్ కూడా వేయించింది. ముర్ము 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. మోడీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అసాధారణమైనదిగా చెప్పవచ్చు.  గిరిజన మహిళకు ఇచ్చిన అవకాశంతో బీజేపీ ఆదివాసి, దళిత, ఇతర బలహీన వర్గాలకు వ్యతిరేకి అనే అపవాద భావాన్ని ఆ వర్గాల్లో నుంచి తీసేసినట్లు అయింది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న 50 ఏండ్లలో ఎనాడూ ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా ప్రతిపాదించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా  పార్టీలోని గొప్ప రాజకీయ అనుభవం ఉన్న మల్లిఖార్జున ఖర్గెలాంటి దళిత నాయకుడినో లేదా మరొక దళిత, గిరిజన మహిళా నాయకురాలినో అభ్యర్థిగా పోటీలో నిలబెట్టే సాహసం చేయలేదు. అందుకు విపక్షాల కూటమి దానికి ఒప్పుకోవడం అనుమానమే.
 

అణగారిన వర్గాలకు గుర్తింపు..
ద్రౌపది ముర్మును పోటీలో నిలబెట్టి.. జాతీయ స్థాయిలో రాజకీయ చక్రం తిప్పాలని ఆశపడిన కేసీఆర్, మమత బెనర్జీలకు బీజేపీ కర్రుకాల్చి వాత పెట్టినంత పనిచేసింది. ఉత్తరభారత్‌లో ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఒడిశా, జార్ఖండ్, బిహార్, పంజాబ్ లాంటి బీజేపీ యేతర రాష్ట్ర సీఎంలు, ఇతర పార్టీలు సైతం బేషరతుగా మద్దతు పలికేటట్లు ప్రధాని మోడీ వ్యూహరచన చేశారు. పైన పేర్కొన్న రాష్ట్ర ముఖ్యమంత్రులతో ఈ మధ్య కాలంలో కేసీఆర్​ రాజకీయ చర్చలు చేశారు కూడా. బీఎస్పీ, అన్నా డీఎంకే, టీడీపీ, వైఎస్సార్​సీపీ, శిరోమణి అకాలిదళ్, శివసేన చీలిక వర్గాలు గత్యంతరం లేక ద్రౌపది ముర్ముకే మద్దతిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల మెజార్టీ ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా ద్రౌపదికి మద్దతుగా క్రాస్ ఓటింగ్ చేసే అవకాశాలూ లేకపోలేదు. అణగారిన వర్గాల ప్రజల రాజకీయ అస్థిత్వాన్ని గుర్తించడంలో, వారిని గౌరవించటంలో బీజేపీయే ముందంజలో ఉంది.  
                                                                                                                                                                                        - డా. నాగం కుమార స్వామి హెచ్​వోడీ, పొలిటికల్​ సైన్స్, పాలమూరు వర్సిటీ