హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ పోస్టుకు ద్రవిడ్ మళ్లీ అప్లై చేసుకోవచ్చు

హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ పోస్టుకు ద్రవిడ్ మళ్లీ అప్లై చేసుకోవచ్చు
  •     అగార్కర్‌‌‌‌‌‌‌‌ నిర్ణయంతోనే ఇషాన్, శ్రేయస్‌‌‌‌ కాంట్రాక్టు తొలగింపు : జై షా

ముంబై : టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్‌‌‌‌తో  ముగియనుంది. ఒకవేళ రాహుల్ ఈ పోస్టులో కొనసాగాలని కోరుకుంటే అందుకు తను తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. కొత్త హెడ్ కోచ్‌‌‌‌ పదవీకాలం మూడేండ్లు ఉంటుందని స్పష్టం చేశారు. తొలుత ద్రవిడ్‌‌‌‌ రెండేండ్ల కాలానికి కోచ్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టాడు. అయితే వన్డే వరల్డ్ కప్‌‌‌‌ ముగిసిన తర్వాత అతనితో పాటు కోచింగ్ స్టాఫ్‌‌‌‌కు బోర్డు ఆరు నెలల కొనసాగింపు ఇచ్చింది. కొత్త కోచింగ్ స్టాఫ్‌‌‌‌ కోసం కొన్ని రోజుల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తామని జై షా తెలిపారు.

ఇప్పటివరకు వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్‌‌‌‌లను ఎంపిక చేయలేదన్న జై షా ఈ విషయంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీనే (సీఏసీ) తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. మరోవైపు ఐపీఎల్‌‌‌‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌’ రూల్‌‌‌‌ ప్రస్తుతం పరీక్ష దశలోనే ఉందన్నారు. వాటాదారులు కోరుకుంటే టీ20 వరల్డ్ కప్‌‌‌‌ ముగిసిన తర్వాత అందరితో చర్చించి ఈ నిబంధనపై పున:పరిశీలన చేస్తామని జై షా చెప్పారు.

ఇక, టీమిండియా క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌‌‌‌ను బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా నుంచి తప్పించడం చీఫ్‌‌‌‌ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తీసుకున్న నిర్ణయమని జై షా తెలిపారు. డొమెస్టిక్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడాలన్న సెలెక్టర్ల సూచనను పట్టించుకోకపోవడంతోనే వాళ్లపై వేటు పడిందన్నారు.