
న్యూఢిల్లీ: టీమిండియా లెజెండరీ క్రికెటర్, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు సమిత్ ద్రవిడ్ తండ్రి బాటలో నడుస్తున్నాడు. కర్నాటక స్టేట్ క్రికెట్‌లో దుమ్మురేపి మంచి పేరు తెచ్చుకున్న సమిత్.. ఇండియా అండర్–19లోకి వచ్చాడు. ఈ నెలలో ఆస్ట్రేలియా అండర్–19 జట్టుతో జరిగే వన్డే, అనధికార టెస్టు సిరీస్‌ల్లో పోటీపడే ఇండియా టీమ్‌కు అతను ఎంపికయ్యాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన 18 ఏండ్ల సమిత్ కర్నాటక జట్టు కూచ్ బెహార్ ట్రోఫీ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నెల 21, 23, 26వ తేదీల్లో పుదుచ్చేరి వేదికగా మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. యూపీకి చెందిన మొహమ్మద్ అమాన్ ఈ సిరీస్‌లో ఇండియా టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అనంతరం చెన్నై వేదికగా జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌ల్లోనూ ఆసీస్‌తో ఇండియా పోటీ పడనుంది. ఈ టీమ్‌ను మధ్యప్రదేశ్‌కు చెందిన సోహమ్ పత్వార్ధన్ నడిపిస్తాడు.