చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుండడంతో సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి అన్ని దేశాల ప్రభుత్వాలు. కరోనా బారినపడిన వారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తుంపర్లు మరొకరిపై పడితే వారికీ సోకుతోంది. దీంతో మాస్కులు ధరించడం కూడా తప్పనిసరి చేశాయి. అయితే ఈ వైరస్ వస్తువులపైనా కొంత సమయం పాటు బతికే ఉంటుంది. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ తరచూ చేతులు కడుక్కుంటున్నప్పటికీ.. మళ్లీ అంతకు ముందు పట్టుకున్న సెల్ ఫోన్, ల్యాప్ టాప్స్ లాంటివి పట్టుకోవడంతో వైరస్ వ్యాప్తిని పూర్తి స్థాయిలో ఆపలేని పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు కరెన్సీ నోట్ల నుంచి కూడా కరోనా అంటుకునే ప్రమాదం ఉందన్న వార్తలు వస్తున్నాయి. దీంతో ఆ ముప్పును కూడా అరికట్టేందుకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఓ ఆవిష్కరణ చేపట్టింది. హైదరాబాద్ లో డీఆర్డీవో పరిధిలో నడిచే రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) శాస్త్రవేత్తలు కాంటాక్ట్ లెస్ అట్రావైలెట్ శానిటైజర్ మెషీన్ ను తయారు చేశారు. దీనికి డిఫెన్స్ రీసెర్చ్ అట్రావైలెట్ శానిటైజర్ (DRUVS) అని పేరుపెట్టారు.
ఫోన్లు, ఎన్వలప్ కవర్లు కూడా.. త్వరలో మార్కెట్ లోకి..
ఆర్సీఐ ల్యాబ్ లో సీరియర్ సైంటిస్టులు గోపీనాథ్, సౌరవ్ కుమార్ కలిసి DRUVS మెషీన్ ను తయారు చేశారు. కేవలం 15 రోజుల్లోనే దీన్ని రూపొందించామని వారు తెలిపారు. దీనితో రకరకాల వైరస్ లు, బ్యాక్టీరియాలను చంపేయొచ్చని తమ పరీక్షల్లో తేలిందన్నారు. దీనిని ఇటీవల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. DRUVSను ఆపరేట్ చేసేందుకు తాకాల్సిన పని కూడాలేదు. ఆటోమేటిక్ గా సెన్సర్ల ద్వారా గుర్తించి వస్తువులను దానిలో పెట్టేలా ఓపెన్ అవుతుంది. 360 డిగ్రీల్లోనూ దానిపై ఎక్కడా వైరస్ బతికి లేకుండా చంపేస్తుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్స్, ఐప్యాడ్స్ తోపాటు కరెన్సీ నోట్లు, చెక్స్, పాస్ బుక్స్, ఎన్వలప్ కవర్లు ఇలా రకరకాల వస్తువులను దీని ద్వారా శానిటైజ్ చేసుకోవచ్చు.
కరెన్సీ శానిటైజర్లలో ఒక్కొక్కటిగా కాకుండా నోట్ల కట్టను పెట్టి సులభంగా శానిటైజ్ చేసేలా కూడా ప్రత్యేకమైన మెషీన్ ను రూపొందించారు. హైదరాబాద్ లోని శాంతి నగర్ లోని విజయ్ మెషీన్ టూల్స్ లో ఈ మెషీన్ల ప్రొడక్షన్ ఇప్పటికే మొదలైందని, త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మూడు రకాల వేరియంట్స్ లో వీటిని తయారు చేస్తున్నారని, టాప్ ఎండ్ రూ.55 వేల వరకు ఉంటుందని చెప్పారు. మిగిలిన రెండు రకాల మోడల్స్ కొంత తక్కువ రేటు ఉంటాయన్నారు. హ్యాండ్ శానిటైజర్లతో పాటు వీటిని కూడా కంపెనీలు, పరిశ్రమల్లో అందుబాటులో ఉంచుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని మరింత సమర్థంగా కట్టడి చేయొచ్చని అభిప్రాయపడ్డారు.