- ప్రత్యేకంగా ఎండోథర్మిక్ స్క్రామ్‌జెట్ ఫ్యూయల్, థర్మల్ బ్యారియర్ కోట్‌ను తయారు చేసిన డీఆర్డీఎల్
హైదరాబాద్, వెలుగు: హైపర్ సోనిక్ (ధ్వని వేగానికి మించి ఐదారు రెట్ల వేగం) స్పీడ్‌తో దూసుకెళ్లే క్షిపణుల్లో అత్యంత కీలకమైన స్క్రామ్‌జెట్ ఇంజన్లకు సంబంధించి కీలక ముందడుగు పడింది. మిసైళ్లు మ్యాక్ 5 స్పీడ్‌లో దూసుకెళ్లినా స్క్రామ్‌జెట్ ఇంజన్ స్థిరంగా మండేలా కీలకమైన కంపోనెంట్‌ను, ఎండోథర్మిక్ స్క్రామ్‌జెట్ ఇంధనాన్ని హైదరాబాద్‌కు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ (డీఆర్డీఎల్) తయారు చేసింది.
థర్మల్ బ్యారియర్ కోటింగ్ (టీబీసీ) గా పిలుస్తున్న ఈ కంపోనెంట్, ఎండోథర్మిక్ ఫ్యూయల్‌ను ఉపయోగించి స్క్రామ్‌జెట్ ఇంజన్‌ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. టీబీసీ కంపోనెంట్, ఎండోథర్మిక్ ఫ్యూయల్‌ను స్క్రామ్‌జెట్ ఇంజన్లలో ఉపయోగించి పరీక్షించడం మన దేశంలోనే తొలిసారి కావడం విశేషం. రెండు నిమిషాల పాటు స్థిరమైన స్థితిలో ఇంజన్‌ను మండించిన డీఆర్డీవో.. హైపర్సోనిక్ మిసైల్స్ తయారీలో మరో అడుగు ముందుకు వేసింది.
ఎంత వేడినైనా తట్టుకునేలా..
పెనుగాలుల్లో కొవ్వొత్తిని అంటించగలమా? అసాధ్యం. అసలు అంతటి గాలుల్లో అగ్గిపుల్ల గీశాక కాసేపైనా మంట ఉండదు. స్క్రామ్‌జెట్ ఇంజన్‌ను మండించడమూ అలాంటిదే. ధ్వనివేగం కన్నా ఐదురెట్ల ఎక్కువ వేగంతో దూసుకెళ్లే మిసైల్స్‌లో ఆ గాలి తాకిడికి ఇంజన్‌ను స్థిరంగా మండించడం అతిపెద్ద సవాల్. ఆ సవాలును అధిగమించేందుకు ఎండోథర్మిక్ స్క్రామ్‌జెట్ ఫ్యూయల్‌ను దేశంలోనే తొలిసారిగా డీఆర్డీఎల్, డీఆర్డీవో కలిసి అభివృద్ధి చేశాయి. అధిక వేడిని తగ్గించడంతో పాటు ఇంజన్‌ను సులభంగా మండించేందుకు ఈ ఇంధనం దోహదపడుతుందని డీఆర్డీవో తెలిపింది.
అంతేకాకుండా హైపర్సోనిక్ ఫ్లైట్‌లో అత్యధిక టెంపరేచర్లను సైతం తట్టుకునేలా ఈ థర్మల్ బ్యారియర్ కోట్‌ను డిపార్ట్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో కలిసి డీఆర్డీఎల్ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఉక్కు మెల్టింగ్ పాయింట్‌కు మించిన టెంపరేచర్లను ఈ కోట్ తట్టుకుంటుందని డీఆర్డీవో సైంటిస్టులు చెబుతున్నారు. స్క్రామ్‌జెట్ ఇంజన్ లోపల ఈ కోట్‌ను వాడుతారని, దీంతో ఇంజన్ స్థిరంగా మండడంతో పాటు దాని సామర్థ్యమూ పెరుగుతుందని వారు పేర్కొన్నారు.