- దశాబ్దాల కల నెరవేరిన వేళ..పసుపు రైతు ఆనందం
తెలంగాణ రాష్ట్రంలో పసుపు పంట పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది నిజామాబాద్ జిల్లానే. దశాబ్దాలుగా ఇక్కడి రైతులు పసుపు పంట సాగు చేస్తూ దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. తెలంగాణలో ఉన్న ఏకైక పసుపు మార్కెట్ కూడా నిజామాబాద్ లోనే ఉంది. ప్రతి ఏటా నిజామాబాద్ మార్కెట్‌కు ఆరు నుంచి ఎనిమిది లక్షల క్వింటాళ్ల పసుపు పంటను రైతులు తీసుకువస్తుంటారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాల్లో పసుపు పంటను సాగు చేస్తున్నప్పటికీ కేవలం నిజామాబాద్‌లోనే అత్యధికంగా 35 నుంచి -40 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. పసుపు పంట సాగు చేస్తే బంగారం పండించినట్లేనని గతంలో రైతులు చెప్పుకునేవారు. అలాంటి ఉన్నత స్థితి నుంచి క్రమంగా మద్దతు ధర పడిపోతూ.. రైతులు నష్టాలు చవిచూడటం ఆనవాయితీగా మారిపోయింది.
ALSO READ : ఎన్నికల్లో అభ్యర్థుల నేరాల వివరాలు తెల్పాలి
ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం సాధించుకుంటే బతుకులు మారతాయనుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత కష్టాలు మరింత ఎక్కువైపోయాయి. ఫలితంగా నిరసనలతో హోరెత్తించి పసుపు బోర్డు ఏర్పాటుతోపాటు మద్దతు ధర కల్పించాలని రైతులు నినదించారు. పసుపు బోర్డు కోసం రైతులు తమ పోరాటం ఉధృతం చేసిన తరుణంలో 2019లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికలను అస్త్రంగా చేసుకున్నారు.
కమలం అభ్యర్థిగా ఉన్న పోటీ చేసిన ధర్మపురి అర్వింద్ పసుపు బోర్డు తెస్తానని లేకుంటే రాజీనామా చేస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఆ పోలింగ్ పోరులో అర్వింద్ ఎవరూ ఊహించని విధంగా ఘనవిజయం సాధించారు. ఆ తర్వాత సుగంధ ద్రవ్యాల సంస్థ విస్తరణ కేంద్రాన్ని సాధించారు. కానీ, దాన్ని రైతులు ఏమాత్రం అంగీకరించకపోగా మళ్లీ ఉద్యమించడం మొదలుపెట్టారు.
పసుపు రైతు కళ్లలో ఆనందం
త్వరలోనే మళ్లీ రాష్ట్రంలో శాసనసభకు ఎన్నికలు రాబోతున్నాయి. పసుపు బోర్డు గురించి మాట నిలబెట్టుకోలేనందుకు రైతులు అడపాదడపా బీజేపీ నేతలపై నిరసనలు కూడా ప్రదర్శించారు, ఉత్తర తెలంగాణలో బీజేపీకి నిజామాబాద్ మంచిపట్టు ఉన్న స్థానం. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే ఇక్కడ విజయం సాధించడం కష్టమని బీజేపీ అభిమానులు, పార్టీ నాయకులు విశ్వసించారు.
చివరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి పసుపు బోర్డు విషయాన్ని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రధానమంత్రి సాక్షాత్తుగా పాలమూరు గడ్డపై పసుపు బోర్డు ప్రకటన వెలువరించడంతో దశాబ్దాల రైతుల కల నెరవేరినట్లయింది. రైతన్నలు చేసిన పోరాటాన్ని ప్రధాని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని, ఈ ప్రాంత రైతులకు మోదీ చేసిన మేలును ఎప్పటికీ మరిచిపోలేమని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినమాట నిలబెట్టుకున్నందుకు ప్రధానికి పసుపు రైతులు కృతజ్ఞులుగా మారినారు.
మోదీకి నీరాజనం
నిజామాబాద్ లో మోదీ సభకు ఎన్నడూ ఊహించని స్థాయిలో పసుపు రైతులు, మహిళలు సైతం హాజరైనారు. మోదీకి నీరాజనాలు పలికారు. వారి సంతోషం అవధులు దాటి పసుపు మాలలతో మోదీని ముంచెత్తడం మనమందరం చూసినదే. గతంలో ఎన్నడూ లేనివిధంగా నేడు తెలంగాణ పసుపు రైతుల కళ్లల్లో ఆనంద బాష్పాలు కారుతున్నాయి. ఏ రైతును పలకరించినా మోదీ జపమే చేస్తున్నారు. కలలోనైనా వస్తుందని ఊహించని పసుపు బోర్డును ప్రకటించడం. చివరకు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలపడంతో రైతుల్లో హర్షం కనిపిస్తున్నది.
జాతీయ పసుపు బోర్డును కేంద్ర మంత్రి మండలి ఆమోదం పొందడంతో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల వ్యాప్తంగా రైతులు, కమలం పార్టీ కార్యకర్తలు ఆనందోత్సాహాల్లో తేలుతున్నారు. ప్రధాని మోదీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పసుపు బోర్డు ప్రకటన చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా.. పసుపు బోర్డు ఏర్పాటు నిర్ణయం తెలంగాణలో కచ్చితంగా రైతులకు ఎలాగూ ఉపయోగంతో పాటు, బీజేపీకి కూడా రాజకీయ ప్రయోజనం కల్పించిందని విమర్శకులు సైతం ఒప్పుకుంటున్న మాట.
-డాక్టర్. బి.కేశవులు ,ఎండి, మానసిక వైద్యుడు