- 12 ఏండ్ల కింద డబ్బులు కట్టిన లబ్దిదారులు
సంగారెడ్డి, వెలుగు: సొంత ఇంటి కలను నిజం చేసుకుందామని 12 ఏళ్ల కింద డబ్బులు కట్టిన మిడిల్ క్లాస్కుటుంబాలకు నిరాశే ఎదురవుతోంది. రాజీవ్ గృహకల్ప కింద సంగారెడ్డిలో మొత్తం 432 ప్లాట్లు నిర్మించాలని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాట్ ధర రూ. 1.49 లక్షలుగా నిర్ణయించి.. రూ. లక్ష లోన్‌గా సమకూరూస్తామని చెప్పింది. ఒక్కో లబ్దిదారు నుంచి రూ. 49 వేల చొప్పున వసూలు చేసింది. కానీ, ప్లాట్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 12 ఏళ్ల కిందట వాటా డబ్బులు కట్టిన వారు తమకు ఫ్లాట్లు అప్పగించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
సగమన్నా కట్టలే
సంగారెడ్డిలోని రెవెన్యూ కాలనీ పక్కన 2009లో అప్పటి ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప ఫ్లాట్లను సాంక్షన్ చేసింది. 2014 ఫిబ్రవరిలో అప్పటి మంత్రులు దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డి, సునీత రెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలనీకి శంకుస్థాపన చేశారు. గృహకల్ప పనులు ప్రారంభించిన కొంత కాలానికే తెలంగాణ ఏర్పడడం, ప్రభుత్వం మారడంతో నిర్మాణాలకు బ్రేక్ పడింది. లబ్ధిదారులు ఇండ్ల కోసం ఆందోళనలు చేపట్టడంతో కేసీఆర్ ప్రభుత్వం 20-17 నాటికి 192 ఫ్లాట్లను నిర్మించి వారికి అప్పగించింది. మిగతా 240 ఫ్లాట్ల సంగతి ఎవరూ పట్టించుకోలేదు.
ఎటు చూసినా మొండిగోడలే
రాజీవ్ గృహకల్పలో ఇప్పుడు మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. 432 ఫ్లాట్లకు గానే 192 ఫ్లాట్లను నిర్మించి పంపిణీ చేశారు. వారికి కూడా తాగునీరు, డ్రైనేజీల్లాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదు. మిగిలిన 240 ఇండ్ల నిర్మాణాలు ఎక్కడి కక్కడే నిలిచిపోయాయి.
చాలా ఇండ్లకు కిటికీలు, తలుపులు లేవు, కొందరు లబ్దిదారులు తమకు కేటాయించిన ఫ్లాట్ల నిర్మాణం పూర్తికాకపోయినా వాటిని స్వాధీనం చేసుకుని అక్కడే ఉంటున్నారు. ఇప్పటికైనా నిర్మాణాన్ని పూర్తి చేయాలని లబ్ధిదారులు ఇటీవల కలెక్టర్ శరత్ ను కలిసి కోరారు. అప్పటివరకు కనీస అవసరాలకు సంబంధించి తాత్కాలిక ఏర్పాట్లు చేయించాలని కోరారు.
సదుపాయాలు కల్పించాలే
12 ఏళ్ల కిందట పైసలు కట్టినా న్యాయం జరగలే. రోడ్డెక్కితే కానీ మా ఫ్లాట్లు మాకు ఇవ్వలేదు. ఆందోళనలు చేస్తేనే ఈ ప్లాట్ దక్కింది. ఇంకా కనీస అవసరాలు కల్పించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇచ్చిన ఫ్లాట్లలో కనీస సౌకర్యాలు కల్పించాలి.
- సునీత , బాధితురాలు
సొంతింటి కల తీరడం లేదు
సొంతింటి కోసం ఎన్నో కలలు కన్నాం. కేసీఆర్ ప్రభుత్వం పేదలపై నిర్లక్ష్యంగా ఉంది. మా వాటా డబ్బులు కట్టి 12 ఏళ్లు అవుతున్నా ఇంకా కనీస సౌకర్యాలు సమకూర్చకలేదు. అధికారుల చుట్టు తిరిగినా పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి.. సౌకర్యాలు కల్పించాలి.
- దుర్గమ్మ (బాధితురాలు)
రూ.6 కోట్ల ప్రపోజల్స్ పంపించాం
సంగారెడ్డి రాజీవ్ గృహకల్పలో పెండింగ్ లో ఉన్న ఫ్లాట్స్ నిర్మాణం కోసం ఏడాదిన్నర కిందటే ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపించాం. ఇంకా రూ.6 కోట్ల ఫండ్స్ అవసరమవుతాయి. ఈ విషయం మంత్రి హరీశ్ రావు ద్వారా ప్రభుత్వానికి నివేదించాం. ఫండ్స్ రాగానే మిగిలిన పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తాం.
- శ్రీనివాస్ ప్రసాద్ ,మేనేజర్, రాజీవ్ గృహకల్ప