బహుజన సమాజంతో విద్యార్థుల కలలు సాకారం

తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్య స్థాపన కోసం నడుం బిగించుకుందామన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాష్ట్రంలో అణగారిన వర్గాలు బాగుపడాలన్నా.. త్యాగం చేసిన విద్యార్థుల కలలు నెరవేరాలన్నా  బహుజన సమాజం రావాలన్నారు. బహుజన, బడుగు వర్గాల బాగు కోసమే  పనిచేస్తా..బహుజన రాజ్యం తప్పకుండా వస్తుందన్నారు. ప్రవీణ్ కుమార్ ఒక్కడు కాదు.. అందరిలో ప్రవీణ్  కుమార్ ఉంటాడని తెలిపారు.

చింతల బస్తీలో ఇంకా డ్రైనేజీ లోనే బడుగు వర్గాల ప్రజలు బతుకుతున్నారని..కేసీఆర్ కోట్లు తిని బహుజన, బడుగు వర్గాలను అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రవీణ్ కుమార్. బంగారు తెలంగాణ అంటే పారిశుధ్య కార్మికులు డ్రైనేజీ లో పడి చనిపోవడమా..అని ప్రశ్నించారు.
  
ఆగస్టు 8వ తేదీన బహుజన సమాజ్‌వాది పార్టీ లో చేరబోతున్నానని చెప్పిన ప్రవీణ్ కుమార్..ఇప్పుడు బహుజన రాజ్యం రాకపోతే మరో వెయ్యి ఏళ్లైనా అధికారాన్ని జేజిక్కించుకోలేమన్నారు. రాబోయే రెండేళ్లు ఎంతో కీలకమని, ప్రతి నిమిషం ఎంతో విలువైందన్నారు. ప్రాణాలను తెగించి తెలంగాణ రాష్టం తెచుకున్నోళ్లకు .. బహుజన రాజ్యం తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదన్నారు. అధికారం కోసం వేసిన అడుగులు ప్రగతిభవన్‌ వెళ్లే వరకు ఆగదన్నారు. అంబేద్కర్ బాటలో నడిచేందుకు, పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి చేసే వరకు పోరాడతానని చెప్పారు.