- మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చీరలు
- చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌లోనే రావాలని ఈవో ఆదేశాలు
యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఈవో భాస్కర్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్ 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. బ్రేక్ దర్శనాలు, నిత్యకల్యాణం, జోడు సేవలు, అభిషేకాలు, వ్రతాల్లో పాల్గొనే దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని సూచించారు.
మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌గానీ, చీరగానీ, లంగా వోణి గానీ ధరించాలని చెప్పారు. విషయం తెలియకుండా వచ్చే వారి కోసం స్టాల్స్ కూడా ఏర్పాటు చేయిస్తామన్నారు. అయితే ఈ డ్రెస్ కోడ్ క్యూలైన్‌లో స్వామి వారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు వర్తించదన్నారు.
రేపటి నుంచి నారసింహుడి జయంతి ఉత్సవాలు
యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహుడి జయంతి ఉత్సవాలను 20 నుంచి నిర్వహిస్తున్నామని ఈవో భాస్కర్‌రావు తెలిపారు. ఆగమ శాస్త్ర పద్ధతిలో నిర్వహించే ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 20న ఉదయం స్వస్తివాచనం, విశ్వక్సేన పూజతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం అమ్మవారికి లక్ష కుంకుమార్చన, స్వామి వారిని తిరువేంకటపతి అలంకారంలో తిరువీధి సేవ నిర్వహిస్తారు.
సాయంత్రం మత్స్యంగ్రహణం, అంకురార్పన అనంతరం వాసుదేవ అలంకార సేవ ఉంటుంది. నృసింహ ఆవిర్భావ వేడుకలను 22న నిర్వహించనున్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా కొండపై భక్తి సంగీతం, భరత నాట్యం, కూచిపూడి, ధార్మిక, సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈవో తెలిపారు.