- ఆర్జిత సేవల్లో పాల్గొనే మహిళలకు చీర, చుడీదార్, పురుషులకు దోతి, తెల్ల లుంగీ
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం నుంచి డ్రెస్ కోడ్ అమల్లోకి రానుంది. జూన్ ఒకటి నుంచి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పక సాంప్రదాయ దుస్తులు ధరించాలని ఇటీవల ఈవో భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళలు చీర లేదా చుడీదార్.. పురుషులు దోతి లేదా వైట్ లుంగీ ధరించాలని, పైన షర్ట్ వేసుకోవచ్చన్నారు.
ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులతో పాటు వెంట ఉండే కుటుంబసభ్యులకు కూడా ఇది వర్తిస్తుందన్నారు. నిత్యం జరిగే ఆర్జిత సేవలైన నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, అర్చనలు, అభిషేకాల్లో పాల్గొనే భక్తులు తప్పక డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది.