- మావోయిస్టు పార్టీ ప్రకటన
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్లో డీఆర్ జీ( డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్)కి చెందిన ఇద్దరు జవాన్లపై మావోయిస్టు పార్టీ స్మాల్యాక్షన్ టీమ్ దాడి చేసి, రెండు తుపాకులను ఎత్తుకెళ్లడం పీఎల్జీఏ విజయంగా పేర్కొంటూ.. మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్సబ్జోనల్కమిటీ కార్యదర్శి సమత మంగళవారం ఒక ప్రకటన రిలీజ్చేశారు. సుక్మా జిల్లా జేగురుగొండ వారపు సంతలో గత ఆదివారం మావోయిస్టులు ఎత్తుకెళ్లిన ఏకే-47, ఎస్ఎల్ఆర్ఆయుధాలతో పాటు తూటాలు ప్రదర్శించిన ఫొటోను చూపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బస్తర్లో అమాయకులను ఎన్కౌంటర్పేరుతో హత్యలు చేస్తూ.. కార్పొరేట్ సంస్థలకు కాపలాగా బేస్ క్యాంపులను నిర్మిస్తున్నాయని ధ్వజమెత్తారు.
యువకుడి హత్యపై పోలీసుల అనుమానాలు
సుక్మా జిల్లా గోండెరాజ్గ్రామానికి చెందిన బండి అనే యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సుక్మా ఎస్పీ కిరణ్చౌహాన్కు సమాచారం అందడంతో వెంటనే బలగాలను పంపించి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి ఒంటిపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు ఉన్నట్లుగా పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అతన్ని మావోయిస్టులు హత్య చేశారా..? లేక గ్రామానికి చెందిన ఆదివాసీల మధ్య ఆధిపత్య పోరులో హతమార్చారా.? అని అనుమానిస్తూ విచారణ చేస్తూ.. కేసు నమోదు చేసినట్టు ఎస్పీ తెలిపారు.