ప్రెషర్​ బాంబు పేలి డీఆర్జీ జవాన్​కు గాయాలు

ప్రెషర్​ బాంబు పేలి  డీఆర్జీ జవాన్​కు గాయాలు

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​ రాష్ట్రం సుక్మా జిల్లాలో కూంబింగ్​ నిర్వహిస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన ప్రెషర్​ బాంబు పేలి డీఆర్జీ(డిస్ట్రిక్ట్  రిజర్వ్  గార్డ్) జవాన్​ కాలికి తీవ్ర గాయాలైనట్లు ఎస్పీ కిరణ్​ చౌహాన్​ తెలిపారు. సుక్మా జిల్లా చింతలనార్​ పోలీస్​స్టేషన్  పరిధిలోని రాయిగూడలో బెటాలియన్​ నంబర్​ 24 డీఆర్జీ బేస్  క్యాంప్​నకు చెందిన జవాన్లు ఏరియా డామినేషన్​ కోసం ఉదయం కూంబింగ్​కు వెళ్లారు. 

ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన మావోయిస్టులు కూంబింగ్​కు వచ్చే మార్గంలో ప్రెషర్​ బాంబును అమర్చారు. 11 గంటల ప్రాంతంలో పొడియం వినోద్​ అనే జవాన్​ ప్రెషర్  బాంబును తొక్కగా, అది పేలడంతో అతని పాదానికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన జవాన్లు ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడ్డారు. గాయపడిన వినోద్​ను రాయిగూడ బేస్​ క్యాంప్​నకు తీసుకెళ్లి ప్రథమ చికిత్స అనంతరం సుక్మా జిల్లా ఆసుపత్రికి తరలించారు. అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. కాగా, మావోయిస్టుల కోసం జవాన్లు రాయిగూడ అడవుల్లో కూంబింగ్​ ముమ్మరం చేశారు.