శంషాబాద్‌‌ ఎయిర్ పోర్టులో రూ.5.5 కోట్ల గంజాయి సీజ్​

శంషాబాద్‌‌ ఎయిర్ పోర్టులో రూ.5.5 కోట్ల గంజాయి సీజ్​
  • మహిళను అదుపులోకి తీసుకున్న అధికారులు

శంషాబాద్, వెలుగు: శంషాబాద్‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో రూ.5.5 కోట్లు విలువ చేసే హైడ్రోపోనిక్‌‌ గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్‌‌ నుంచి వస్తున్న ఓ మహిళ నుంచి ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌కు వచ్చిన ఓ మహిళ లగేజీని డీఆర్‌‌‌‌ఐ అధికారులు తనిఖీ చేయగా.. అందులో 5.438 గ్రాముల హైడ్రోపోనిక్‌‌ గంజాయిని గుర్తించారు. దీని విలువ మార్కెట్‌‌లో రూ.5.5 కోట్లు ఉంటుందని తెలిపారు. అనంతరం నిందితురాలిని అరెస్ట్‌‌ చేశారు. సాధారణంగా గంజాయిని నేలపై పెంచుతుంటారు. కానీ, ఈ హైడ్రోపోనిక్ గంజాయిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబుల్లో సాగు చేస్తారు.

 వీటి మొక్కల వేర్లు నీళ్లలో ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకమైన వాతావరణాన్ని కృత్రిమంగా ఏర్పాటు చేసి, పెంచుతారు. ఈ రకం గంజాయిని పెంపకానికి ఖర్చు కూడా ఎక్కువ ఉండటంతో.. ధర కూడా లక్షల్లో ఉంటుంది. ఈ పద్ధతిలో గంజాయి మొక్కను పూర్తిగా పెంచడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుంది. ఎక్కువగా బ్యాంకాక్​, ఇతర దేశాల నుంచి మన దేశంలోని చెన్నై, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌‌కు తీసుకువస్తూ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో పట్టుబడుతున్నారు.

తుకారాంగేట్ ​వద్ద పదిన్నర కిలోలు 

పద్మారావునగర్: ఒడిశా నుంచి గంజాయి తెచ్చి సిటీలోని కార్మికులకు విక్రయిస్తున్న వ్యక్తిని టాస్క్​ ఫోర్స్​పోలీసులు అరెస్టు చేశారు. రూ.4,48,210 విలువైన 10.30కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని గంజామ్ జిల్లాకు చెందిన బబుతీ భూషన్ పటేల్ 2007లో ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. కొన్నాళ్లు భవన నిర్మాణ కార్మికుడి, జేసీబీ ఆపరేటర్​గా పనిచేశాడు.

 కూలీ డబ్బులు సరిపోక ఖాళీ టైంలో జోమాటో డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. భవన నిర్మాణ కార్మికులు గంజాయి తాగుతారని గమనించి వారికి గంజాయి విక్రయించి డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. ఒడిశా నుంచి రాహుల్ అనే వ్యక్తి దగ్గర కిలో రూ.5 వేలకు కొని సిటీలోని కార్మికులకు అమ్ముతున్నాడు. ఈ నెల 3న ఒడిశా నుంచి గంజాయి తెస్తూ తుకారాం గేట్ పీఎస్​పరిధిలోని కాలనీలో పోలీసులకు చిక్కాడు.