భూమి అమ్మిన పైసలు ఇప్పించాలని  పురుగుల మందు తాగిండు

  •     సోషల్ మీడియాలో షేర్ ​చేసిన బాధితుడు 
  •     దవాఖానకు తరలించిన కుటుంబసభ్యులు

సూర్యాపేట, వెలుగు : రెండేండ్ల క్రితం భూమి అమ్మితే చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశాడన్న ఆవేదనతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సూసైడ్ కు ముందు సెల్ఫీ వీడియో తీసుకోగా, గురువారం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(యస్) మండలం కోటినాయక్ తండాకు చెందిన ధరావత్ శ్రీకాంత్  రెండేండ్ల కింద 25 గుంటల భూమిని ధరావత్ రాజేశ్​కు రూ. కోటికి అమ్మాడు. ఇందులో భాగంగా మొదటి విడతగా రాజేశ్​రూ.60 లక్షలు చెల్లించాడు. మిగతా రూ.40 లక్షలు చెక్ లు ఇవ్వగా అవి బౌన్స్ అయ్యాయి.

దీంతో రాజేశ్​ను డబ్బులు అడుగుతుండడంతో ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకపోవడంతో బుధవారం సాయంత్రం కోటినాయక్​తండాలోని అమ్మిన భూమిలో  సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తర్వాత సోషల్​మీడియాలో షేర్​ చేశాడు. ఇది చూసిన కుటుంబసభ్యులు అతడి దగ్గరకు వెళ్లగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.  ప్రస్తుతం చికిత్స చేస్తున్నామని, ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెప్పారు.