సింగరేణి కుటుంబాల్లో.. తాగునీటి తండ్లాట..!

  •     ఫిల్టర్​బెడ్స్​ల్లో అడుగంటిన నీరు
  •     అరిగోస పడుతున్న కార్మికులు
  •     అధికారుల లోపమేనంటున్న సంఘాలు 
  •     నివారణ చర్యలు చేపడుతున్నామన్న ఆఫీసర్లు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి కార్మిక కుటుంబాలు తాగునీటి కోసం తంటాలు పడుతున్నాయి. ఫిల్టర్​బెడ్స్ లో నీళ్లు అడుగంటాయి. రా వాటర్​సప్లై లేక ట్యాంక్​ల్లో అడుగున ఇసుక కనిపించే దుస్థితి ఏర్పడింది. కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి కార్మిక కుటుంబాలు మంచి నీళ్ల కోసంఎదురుచూస్తున్నాయి. ఎండలు ముదరకముందే వారు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. నీటి సప్లై విషయంలో అధికారుల నిర్లక్ష్యం, ప్రణాళిక లోపం ఉందని కార్మిక సంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు. 

నీరున్నా తప్పని తిప్పలు..

నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ప్రణాళికే సక్కగా లేదు. దీంతో కార్మిక కుటుంబాలకు నీటి తిప్పలు తప్పడం లేదు. కొత్తగూడెం ఏరియాలోని సింగరేణి కార్మికులు మంచి నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రుద్రంపూర్, తిలక్​నగర్, గౌతంపూర్, నాలా ఏరియా, గోఫ్​ఏరియా, వెల్ఫేర్​సెంటర్, మార్కెట్ ఏరియా, ఎర్రగడ్డ, ధన్​బాద్​తదితర ప్రాంతాల్లో రెండు మూడు రోజులకోసారి నీటి సప్లై సాగుతోంది. తిలక్​ నగర్​లో వారం రోజులుగా నీరు రాక కార్మిక కుటుంబాలతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీకే ఓసీ, 7షాఫ్ట్, 5బీ షాఫ్ట్​ల నుంచి పైప్ లైన్ల ద్వారా రా వాటర్​ రుద్రంపూర్ లోని ఫిల్టర్ బెడ్​కు వస్తుంటాయి. జీకే ఓసీ, 7షాఫ్ట్ నుంచి పైప్​లైన్​నుంచి వాటర్ సప్లై లేదు. జీకేఓసీతోపాటు 7షాఫ్ట్, 5బీషాఫ్ట్, తెల్లవాగు ప్రాంతాల్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఆయా బొగ్గు బాయిల వద్ద ఫుల్లుగా నీరున్నా సప్లై చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు.

మోటార్లు సరిగా పనిచేయకపోవడంతో వాటర్ సప్లైలో తరుచూ ఇబ్బంది కలుగుతోంది. తెల్లవాగు నుంచి వచ్చే బోర్ల నుంచి వాటర్ వృథాగా పోతోంది. పైప్ లైన్​లీకేజీలను అరికట్టడంలోనూ అధికారులు విఫలమయ్యారు. గుట్టమీద ఫిల్టర్​బెడ్​తోపాటు కింద ఉన్న ఫిల్టర్​బెడ్ లో నీరు అడుగంటింది. నీళ్లు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసే పరిస్థితి కార్మిక కుటుంబాల్లో నెలకొంది. నీటి సరఫరా సక్రమంగా లేక డ్యూటీకి వెళ్లి వచ్చి స్నానాలు కూడా చేయలేకపోతున్నామని కార్మికులు వాపోతున్నారు. నీటి సరఫరా చేయాలని ఫిల్టర్ బెడ్​వద్దకు వచ్చి నీళ్లున్నాయా లేదా అని చూసుకుంటూ వెళ్తున్నామని కార్మికులు అంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఎండలు ముదిరితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నివారణకు ప్రత్యేక ప్రణాళిక..

కొత్తగూడెం ఏరియాలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక చేస్తున్నాం. ఇప్పటికే సివిల్ అధికారులతో మాట్లాడాం. నీటి సమస్యపై నోడల్ అధికారిగా సామ్యూల్​సుధాకర్​ను నియమించాం. ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయో గుర్తించి రిపేర్లు చేయాలని ఆదేశించాం. ఎండా కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం.  - జక్కం రమేశ్, జీఎం, కొత్తగూడెం ఏరియా

అధికారుల ప్రణాళిక లోపమే కారణం..

 కొత్తగూడెం ఏరియాలోని కాలనీ వాసులు వేసవికి ముందే నీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. కాలనీల్లో ఇప్పటికే అధికారులతోపాటు జీఎం రమేశ్ ను కలిసి విన్నవించాం. నీరు సరఫరా చేయకపోవడంలో అధికారుల ప్రణాళిక లోపమే కారణం. లీకేజీలను ఎప్పటికప్పుడు అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు.
 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- వంగా వెంకట్, సింగరేణి కాలరీస్​వర్కర్స్​యూనియన్​ ఆర్గనైజింగ్​ సెక్రటరీ