మద్యం కట్టడి కోసం మరో పోరాటం అవసరం

మనిషి ఆరోగ్యంగా ఎదగడానికి విషపూరితం గాని పౌష్టిక, వైవిధ్యమైన ఆహారం, కలుషితం గాని మంచి నీరు, పరిశుభ్రమైన పరిసరాలు, శాస్త్రీయ దృక్పథంతో ప్రకృతిని అర్థం చేసుకునే జ్ఞానం, సమస్యలను ఉమ్మడిగా పరిష్కరించుకునే పరస్పర సహకార వ్యవస్థ, వీటిని బలోపేతం చేసే విధంగా ఉండే ప్రభుత్వ విధానాలు, కొన్ని స్పష్టమైన చట్టాలు, మార్గదర్శకాలు, అమలుకు కావాల్సిన నిధులు, మానవ వనరులు–ఇవన్నీ ఉంటే మాత్రమే మనుషులు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. ఇది జరగాలంటే రసాయన ఎరువులు, పురుగు విషాలు లేని సుస్థిర, సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం రాష్ట్రమంతటా జరగాలి. ఇదొక్కటే కాదు, మద్యం, సిగరెట్లు, బీడీ, తంబాకు, గుట్కా, కల్తీ కల్లు, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలపై నియంత్రణ ఉండాలి. ప్రజలు వాటికి దూరంగా ఉండాలి. ఇందు కోసం ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలు, ప్రజలు ఉమ్మడిగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ విన్న వెంటనే, రాష్ట్రంలో ఇది ఆచరణ సాధ్యం కాదు అనిపిస్తుంది కదూ? దానికి కారణాలు అనేకం. పేదరికం, నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు, ప్రజల సాంస్కృతిక జీవనం, బలహీనంగా స్థానిక పరిపాలనా వ్యవస్థలు, మద్యం ఆదాయంపై ఆధార పడుతున్న రాష్ట్ర బడ్జెట్ లు, దీర్ఘ కాలంగా ప్రజల్లో ఉన్న మద్యం అలవాట్లు, మద్యం కంపెనీలు, కల్తీ కల్లు ఉత్పత్తి, మార్కెటింగ్ పై ఆధారపడిన మాఫియా, కుటుంబాలు, అన్నిటినీ మించి మద్య నిషేధం సాధించి, అమలు చేయించుకోవడం సాధ్యం కాదని ముందే చేతులు ఎత్తేసిన సామాజిక, రాజకీయ శ్రేణుల వైఖరులు.. ఇవన్నీ కారణాలే.

హర్యానా తరహా విధానం కావాలి

ఎప్పుడైనా, ఎవరైనా మద్య నిషేధం గురించి చర్చ ప్రారంభించగానే, దాన్ని వ్యతిరేకిస్తూ వాదనలు చేస్తున్నది ప్రభుత్వాలో వ్యాపారులో కాదు, కొంతమంది సోకాల్డ్ బుద్ధిజీవులే. ఈ పరిస్థితి మారాలి. ‘మా ఆరోగ్యాలను పాడు చేసుకుంటాం, మా డబ్బులతో మేము తాగుతాం, అది మా హక్కు’ అనే వాళ్ల కోణంలో నుంచి కాకుండా, సమాజంలో అట్టడుగున ఉన్న పేదల, బలహీన వర్గాల, శ్రమ జీవుల కుటుంబాల భవిష్యత్తు కోణం నుంచి ఈ చర్చ ఎక్కువ జరగాలి. తమ తప్పుడు విధానాలను, అవినీతిని ప్రజలు ఎప్పుడూ ప్రశ్నించకుండా ఉండాలని ప్రభుత్వాలు కోరుకుంటాయి. కానీ ప్రజలు చైతన్యవంతులు కావాలి. ప్రశ్నించే స్వభావాన్ని కలిగి ఉండాలని కోరుకునే వాళ్లు మాత్రం రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం వ్యసనంపై మాత్రం చర్చ కొనసాగించాలి. కొన్ని రాష్ట్రాల్లో మద్యం నిషేధించారు. కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. కొన్ని పొరపాట్లూ కొనసాగుతున్నాయి. సాధించిన సానుకూల ఫలితాలను ప్రచారం చేస్తూనే, ఆయా ప్రభుత్వాలు మద్య నిషేధానికి తూట్లు పొడవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టాలి. మద్యం పూర్తిగా నిషేధించకుండా, దాన్ని ప్రజలకు అందుబాటు నుంచి తొలగించకుండా, కేవలం కొద్ది పాటి నియంత్రణతోనే లేదా ప్రచారంతోనే ఈ అలవాటును మాన్పించగలుగుతామని అనుకోవడానికి లేదు. కనీసం ‘మద్య నియంత్రణతో ప్రారంభించి, నిషేధం వైపు ప్రయాణం ప్రారంభించాలి’ అనే నినాదం మారుమోగాలి. నిషేధం తప్పకుండా అవసరమని మహాత్మాగాంధీ1930 లోనే స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వాలకు మద్య నిషేధం అమలు పట్ల రాజకీయ చిత్త శుద్ధి ఉంటే, పార్టీలకు, సామాజిక సంస్థలకు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా దీన్ని అమలు చేయించుకోవాలనే పట్టుదల ఉంటే, ఇది ఎంత మాత్రమూ అసాధ్యం కాదు. రాష్ట్రం మొత్తంలో కాకుండా, మద్యం ఉత్పత్తిని, అమ్మకాలను నిషేధించుకునే అధికారం గ్రామ పంచాయతీలకు కట్టబెడుతూ హర్యానా ప్రభుత్వం రెండేండ్ల క్రితం ఒక చట్టం చేసింది. ఈ చట్టం ప్రకారం గ్రామ సభలో10 శాతం జనాభా మద్యం అమ్మకాలు వద్దని తీర్మానం చేస్తే సరిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రయత్నంతో ఒక మార్గం వేయవచ్చు. అనుభవాల నుంచి  నేర్చుకుని ముందుకు పోవచ్చు. 

కుటుంబాలు కూలుతున్నయి..

సాధారణంగా మద్యంపై సమాజంలో చర్చ జరుగుతున్నప్పుడు కొన్ని తప్పుడు వాదనలు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా మద్యం తాగడం వ్యక్తిగత హక్కు కాబట్టి, దాన్ని నియంత్రించడం, నిషేధించడం వ్యక్తిగత హక్కుకు భంగకరమని వాదించే వాళ్లున్నారు. నిజానికి ఒక దుర్వ్యసనం వ్యక్తిగత హక్కు ఎంత మాత్రమూ కాదు. ఎందుకంటే, ఈ అలవాటు ఆ వ్యక్తిని మాత్రమే కాదు, ఆ వ్యక్తి కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయా కుటుంబాల మహిళల, పిల్లల భవిష్యత్తునూ చుట్టూ సామాజిక, రాజకీయ వాతావరణాన్ని విధ్వంసం చేస్తున్నది. రాష్ట్రంలో 14 లక్షల మంది వితంతు మహిళలు ఉండటానికి ఈ మద్యం తనదైన పాత్ర పోషించింది. ఏ మహిళను కదిపి చూసినా మద్యం తమ కుటుంబాలకు ఎంత నష్టం చేస్తున్నదో స్పష్టంగా చెబుతారు. తెలంగాణ ప్రజల సంస్కృతిలో మద్యం ఒక భాగమని, దాన్ని నియంత్రించడం, నిషేధించడం ఆ సంస్కృతిపై దాడి అని వాదించే వాళ్లూ ఉన్నారు. తొలి నుంచి తెలంగాణ కుటుంబాల్లో( అన్ని కులాలలో కాదు) కల్లు తాగడం ఒక అలవాటుగా ఉన్న మాట వాస్తవం. కల్లు అంటే చెట్టు కింద కూర్చొని, కల్తీ లేకుండా తాగే నీరా ఎంత మాత్రమూ కాదు. కానీ కల్లు పేరుతో ఇప్పుడు వ్యాపారులు అమ్ముతున్నది ఎంత మాత్రమూ కల్లు కాదు. అత్యంత ప్రమాద కరమైన మత్తు కలిగించే, ఆరోగ్యాన్ని పాడు చేసే పానీయం మాత్రమే. పైగా ఇప్పుడు వైన్స్ లో అమ్ముతున్నది, మొదటి నుంచి ప్రజల సాంస్కృతిక జీవనంలో ఉన్న కల్లు కాదు. అది కూడా మత్తు కలిగించే ప్రమాదకరమైన పానీయం మాత్రమే. వీటిని ప్రజల మీద రుద్దింది కేవలం వ్యాపారుల లాభాల కోసమూ, ప్రభుత్వాల పన్నుల ఆదాయం కోసమూ తప్ప, తెలంగాణ సంస్కృతిని కాపాడటానికి కాదు అన్నది గుర్తించాలి. 

మద్యం పైసలతో పథకాలకు నిధులా?

తెలంగాణ వ్యవసాయ రంగంలో పురుగు, కలుపు విషాలు, రసాయన ఎరువులు ఎంత విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో, సామాజిక, రాజకీయ రంగాల్లో మద్యం అంతే విధ్వంసాన్ని సృష్టిస్తున్నది. మునుగోడు ఎన్నికలో ఒక్క నియోజక వర్గంలో ఒక్క నెలలో రూ.300 కోట్ల విలువైన మద్యం ఏరులై పారిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మద్యం కుటుంబాలను ఆర్థికంగా దివాళా తీయించడమే కాదు, ఆయా కుటుంబాల్లో హింసను పెంచుతున్నది. వ్యక్తులను మృత్యువు వైపు నడిపిస్తున్నది. రోడ్డు ప్రమాదాలకు, స్త్రీలపై హింసకు కారణమవుతున్నది. ఏ రోజు ఏ పేపర్ తిరిగేసినా, నేర ఘటనల వార్తల్లో మద్యం పాత్ర స్పష్టంగా కనపడుతున్నది. వీటిని మించి మనిషి ఆలోచనా శక్తిని, విచక్షణా జ్ఞానాన్ని మద్యం చంపేస్తున్నది. సమష్టితత్వాన్ని, ప్రజాస్వామిక విలువలను దెబ్బ తీస్తున్నది. ఇవాళ ఏ గ్రామం, పట్టణం, ఏ బస్తీలోనూ ప్రజలతో రాత్రి పూట సమావేశాలు జరపలేని పరిస్థితి ఉందని అందరూ అంటున్నారంటే దానికి ప్రధాన కారణం మద్యమే. అంటే ప్రస్తుతం కొనసాగుతున్నది మద్యం ఆధారిత సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థ మాత్రమే. అమలులో ఉన్నది అనాగరిక విలువలు మాత్రమే. విషాదం ఏమిటంటే మొత్తం దేశంలోనే ఈ మద్యం విషయంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం. తెలంగాణ ప్రభుత్వానికి 2014–15లో మద్యంపై వచ్చిన ఎక్సైజ్ పన్ను ఆదాయం రూ. 2,823 కోట్లు కాగా, 2021–22 నాటికి ఇది రూ. 20 వేల కోట్లకు చేరింది. ఈ పన్ను ఆదాయాన్ని రూ. 25 వేల కోట్లకు తీసుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసుకుంటున్నది. అంటే రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ పన్ను ఆదాయం 8 రెట్లు పెరిగిందన్నమాట. రైతు బంధు(రూ.14 వేల కోట్లు),  రైతు బీమా(రూ.1300 కోట్లు), ఆసరా పెన్షన్లకు( రూ.10,000 కోట్లు) రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు మొత్తం రూ. 25,000 కోట్లు కాగా, ఈ మొత్తాన్ని పూర్తిగా మద్యం తాగే వారి జేబుల నుంచే వసూలు చేస్తున్నది. అంటే ప్రజల డబ్బులు ప్రజల చేతుల్లో పెట్టి, రాజకీయంగా టీఆర్ఎస్​పార్టీ ప్రయోజనం పొందుతున్నది. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది?
–కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక