కంటోన్మెంట్ ఏరియాలో.. మంచినీటి కష్టాలు

కంటోన్మెంట్ ఏరియాలో.. మంచినీటి కష్టాలు
  • జీహెచ్​ఎంసీ, కంటోన్మెంట్​ బోర్డు మధ్య సమన్వయ లోపం
  • ఫలితంగా నాలుగు రోజులకోసారి సరఫరా      
  • అల్లాడుతున్న జనం

కంటోన్మెంట్, వెలుగు: కంటోన్మెంట్​ప్రజల మంచినీటి కష్టాలు తీరకపోగా.. మరింత ఎక్కువయ్యాయి. నాలుగైదు రోజులకు ఒకసారి సరఫరా అవుతుండటంతో జనాలు అల్లాడుతున్నారు. నీటి సరఫరా విషయంలో అటు కంటోన్మెంట్, ఇటు వాటర్​బోర్డ్ అధికారుల మధ్య సమన్వయ లోపంతో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. కంటోన్మెంట్ పరిధిలో మంచినీటి వినియోగం పెరగడంతో డిమాండ్​కు అనుగుణంగా నీటి సరఫరాను పెంచాలని వాటర్​బోర్డును కంటోన్మెంట్​బోర్డు అధికారులు కోరారు. అయితే నల్లా కనెక్షన్ ఛార్జీలను గత కొంత కాలంగా బోర్డు తమకు చెల్లించడం లేదని, ఆ చార్జీలు చెల్లిస్తేనే  నీటి సామర్థ్యాన్ని పెంచుతామంటూ వాటర్​బోర్డ్​అధికారులు భీష్మించారు.

దీంతో కంటోన్మెంట్​ప్రాంతంలో నాలుగు రోజులకోసారి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు నిత్యం సరఫరాలో కలిగే అంతరాయం, షట్​డౌన్​లు కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. బోర్డు సమీపంలోని జీహెచ్​ఎంసీ పరిధిలో ప్రతి రోజు నీటి సరఫరా జరుగుతుండగా.. తాము మాత్రం అల్లాడుతున్నామని కంటోన్మెంట్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కనెక్షన్​ఛార్జీలు చెల్లించకపోవడంతో..

సికింద్రాబాద్​కంటోన్మెంట్​లోని సుమారు 350 కాలనీల్లో దాదాపు 4లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. వీరి కోసం బోర్డు పరిధిలో 30,292 కనెక్షన్లు ఉన్నాయి. సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 10 ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కంటోన్మెంట్​కు రోజుకు చొప్పున 5.9 మిలియన్​గ్యాలన్ల నీటిని జీహెచ్​ఎంసీ సప్లై చేస్తుండగా.. ఆ నీటిని కంటోన్మెంట్​బోర్డు కాలనీలకు సరఫరా చేస్తోంది. అయితే ఇప్పటికే ప్రజలు నీటి సమస్యను ఎదుర్కొంటుండగా..  వేసవిలో వినియోగం మరింత పెరగడంతో 7.3 మిలియన్​గ్యాలన్ల నీటిని సరఫరా చేయాలని కంటోన్మెంట్ బోర్డు అధికారులు కోరారు. సరఫరాను పెంచాలని ఓ నివేదికను కూడా వాటర్​బోర్డుకు అందజేశారు. దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన వాటర్​బోర్డు అధికారులు కనెక్షన్ చార్జీల కింద రూ.17కోట్లు చెల్లించాలని కోరారు. అయితే నిధులు లేకపోవడంతో ఆ ఛార్జీలను కంటోన్మెంట్​బోర్డు చెల్లించలేకపోయింది. దీంతో ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ప్రజలకు నీటి సమస్యలు తీరే పరిస్థితి కనిపించడంలేదు.

పనికిరాని మంచినీటి సరఫరా పథకం

ఇదిలా ఉంటే కంటోన్మెంట్​బోర్డు పరిధిలో కొనసాగుతున్న 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా పథకానికి సంబంధించి కనెక్షన్ల పనులు కూడా నెమ్మదిగా సాగుతున్నాయని జనాలు వాపోతున్నారు. ఇప్పటివరకు బోర్డు పరిధిలో 30వేల మంది ఉచిత మంచినీటి పథకానికి అర్హత కలిగి ఉండగా.. వారిలో 12వేల మంది తమ ఆధార్​ కార్డుల ద్వారా కనెక్షన్ పొందారు. మిగతా వారు పొందాల్సిఉంది. అయితే ఇప్పటికే మంచినీటి సమస్య తీవ్రంగా ఉండటంతో ఉచిత కనెక్షన్ పొందినా పెద్దగా కలిగే లాభం లేకుండా పోతోంది.

తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటున్నం 

కంటోన్మెంట్​లో కొంతకాలంగా తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం. బోర్డు అధికారులు, వాటర్​బోర్డ్ మధ్య సమన్వయం లేకపోవడంతో మాకు సరిపడా నీరు సరఫరా కావడంలేదు. నాలుగు రోజుకోసారి నీటి సరఫరా జరుగుతుండటంతో ఇబ్బంది పడుతున్నాం. ‌‌‌‌ -
-  సతీశ్ గుప్తా, వాసవి నగర్​ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

నీటిని కొనుక్కుంటున్నం

కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఉన్నప్పుడు నీటి కష్టాలు ఎదుర్కొన్నాం. పాలక మండలి రద్దయిన తర్వాత సమస్య మరింత తీవ్రమైంది. దీంతో గతేడాది నుంచి సొంతంగా డబ్బులు చెల్లించి నీటిని తెప్పించుకుంటున్నాం. అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి.
- చంద్రశేఖర్, బోయిన్​పల్లి