- శ్రీశైలంలో అందుబాటులో ఉన్నది 5 టీఎంసీలే..
- ఉమ్మడి పాలమూరులో భగీరథ, పీఆర్, మున్సిపల్ ఆఫీసర్ల అలర్ట్
- గ్రామాల్లో బోర్ల లెక్కలు తీస్తున్న అధికారయంత్రాంగం
నాగర్ కర్నూల్, వెలుగు : శ్రీశైలం రిజర్వాయర్ అడుగంటుతున్నందున ఈ ఎండాకాలంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. మిషన్ భగీరథ ద్వారా వీలైనంత వరకు నీటి సరఫరా చేసి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మున్సిపాలిటీలు, గ్రామాల్లోని బోర్లు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు ఆదేశించారు.
మార్చి నుంచే ఖాళీ అవుతున్న ప్రాజెక్ట్..
మార్చి నెలలో 42 డిగ్రీలకు చేరిన ఎండలతో శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అవుతోంది. కృష్ణా బేసిన్లో తక్కువ వర్షపాతం నమోదు కావడంతో శ్రీశైలం జలాశయంలోకి అంచనాలకు తగ్గట్టుగా నీళ్లు రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడి ఈ ఏడాది జనవరి వరకు కరెంట్ ఉత్పత్తి చేయడంతో శ్రీశైలం రిజర్వాయర్‌లో నీరు అడుగంటే పరిస్థితి ఏర్పడింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేఎల్ఐ కింద యాసంగి సాగుకు నీరివ్వలేమని చెప్పి, అక్టోబర్ 30 నుంచి కేఎల్ఐ పంపులు, మోటార్లు బంద్ పెట్టింది. సగం పంటలు ఎండి రైతులు నష్టపోగా, ఇప్పుడు తాగునీటికి కష్టాలు తప్పేటట్లు లేవని అధికారులు టెన్షన్ పడుతున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్‌లో ప్రస్తుతానికి 810 అడుగుల వద్ద 34 టీఎంసీల నీళ్లున్నట్లు కేఆర్ఎంబీ రికార్డ్‌లో నమోదైంది. ఇంజనీర్ల అనధికార చర్చల్లో మరో 10 రోజులకు సరిపడా మాత్రమే నీళ్లు వచ్చే అవకాశం ఉందని సమాచారం. తెలంగాణకు రావాల్సిన 15 టీఎంసీల నీటివాటాకు మించి వాడుకున్నందున ఏపీ ఫిర్యాదుపై స్పందించిన కేఆర్ఎంబీ భగీరథకు కేటాయించిన నీటివాటా(దాదాపు 8 టీఎంసీలు) ఊసెత్తడం లేదని తెలిసింది.
ఉమ్మడి జిల్లాపై ఎఫెక్ట్..
ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న 5 టీఎంసీల నీటిని ఆరు జిల్లాల్లోని19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 19 మున్సిపాలిటీలు,3,200 గ్రామాల తాగునీటి అవసరాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని వాడుకోవాల్సి ఉంది. పెరుగుతున్న ఎండల తీవ్రతతో నీటి ఆవిరి శాతం ఎక్కువగా ఉందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఐదు టీఎంసీల నీటిని జూన్ చివరి నాటికి లేదా జులైలో వర్షాలు మొదలయ్యే వరకు సర్దుబాటు చేసుకోవాలి. ప్రస్తుతానికి శ్రీశైలం రిజర్వాయర్‌లో 34 టీఎంసీలే ఉన్నాయి.
కొల్లాపూర్ మండలం ఎల్లూరు శివారులోని కేఎల్ఐ ఫస్ట్ లిఫ్ట్ నుంచి నీటిని ఎల్లూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి అక్కడి నుంచి వాటర్ గ్రిడ్‌కు తరలిస్తారు. ఎల్లూరు గ్రిడ్ నుంచి గౌరిదేవిపల్లి, కల్వకుర్తి, కర్కల్ పహాడ్, కమ్మదనం, రాఘవాపూర్ డబ్ల్యూటీపీ(వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్)కి రా వాటర్ సప్లై చేస్తారు. డబ్ల్యూటీపీల్లో ఫిల్టర్ చేసిన నీటిని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు తాగునీటిని సప్లై చేస్తున్నారు.
ప్రతి రోజూ రివ్యూలే...
వేసవిలో తాగునీటి సరఫరాకై మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆఫీసర్లు ప్రతిరోజు రివ్యూలు నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ లెవల్లో గ్రామ కార్యదర్శుల నుంచి పాత బోర్ల వివరాలు తెప్పిస్తున్నారు. మిషన్ భగీరథ స్కీం ప్రారంభానికి ముందు వినియోగించిన బోర్ మోటర్ల వివరాలు, స్టాక్, వర్కింగ్ కండీషన్‌పై ఆవాసాల వారీగా లెక్కలు తీస్తున్నారు.
వారంలో ఐదు రోజులు చీఫ్ సెక్రటరీ స్థాయి నుంచి వివిధ శాఖల ముఖ్య కార్య దర్శులు, కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఈఎన్సీ, సీఈ, ఎస్ఈ, ఈఈలు, డీపీవోలు, ఎంపీడీవోలు, గ్రామ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లు తప్పడం లేదు. మరో 15 రోజుల తరువాత నీటి కష్టాలను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సన్నగిల్లుతున్న ఆశలు..
ఎండలు ముదరకముందే శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు అడుగంటడంతో మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని సప్లై చేసే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. కృష్ణా బేసిన్లో నీటి లభ్యతను అంచనా వేసి, కేఎల్ఐ కింద యాసంగి పంటలకు నీళ్లివ్వకుండా అక్టోబర్ 30 నుంచే మోటార్లు బంద్ పెట్టామని
అయితే ఏపీ వైపు లెక్కలు లేకుండా నీటిని వాడేసుకున్నారని రాష్ట్ర ఇంజనీర్లు ఆరోపిస్తున్నారు. కేఆర్ఎంబీలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్న ఇంజనీర్లలో ఎక్కువ మంది ఏపీకి చెందిన వారు ఉండడంతో నీటి వినియోగంలో దొంగ లెక్కలు చెబుతున్నారని ఇంజనీర్లు అంటున్నారు.