ఏజెన్సీ గ్రామాల్లో భగీరథ రాదు.. బాధ తీరదు

 ఏజెన్సీ గ్రామాల్లో భగీరథ రాదు.. బాధ తీరదు
  •  ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులకు తాగు నీటి కష్టాలు 
  •  ఉదయం 4 గంటలకే చేతిపంపులు, బావుల వద్ద పడిగాపులు
  •  జిల్లా వ్యాప్తంగా అడుగంటుతున్న భూగర్భ జలాలు
  •  88 హ్యాబిటేషన్లలో సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు 
  •  ఏప్రిల్, మే నెలల్లో తీవ్రస్థాయికి చేరే అవకాశం

ఆదిలాబాద్ మండలం ఖండాల గ్రామంలో తాగు నీటికి ప్రస్తుతం ఈ ఒక్క బావే దిక్కు. గ్రామంలో దాదాపు 600 మంది జనాభా ఉంది. మిషన్ భగీరథ నీరు వారం రోజుల నుంచి రాక.. చేతి పంపులు పనిచేయక తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. ఊరి బయటున్న ఒక్క బావి లోనే కాస్త నీరుండడంతో రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేచి ఆ బావి వద్దకు పరుగులు తీస్తున్నారు. బావి నీరు నల్ల రంగులో కలుషితంగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో తాగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో ఈ నీరు సైతం అడుగంటిపోయే ప్రమాదం ఉందని, ఆ తర్వాత పరిస్థితి ఏమిటోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులెవరూ పట్టిచుకోవడం లేదన్నారు. ఈ విషయంపై మిషన్ భగీరథ ఈఈ గోపీచంద్​ను వివరణ కోరగా మోటర్ల రిపేర్ కారణంగా సరఫరా ఆగిపోయిందని, పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. 

ఆదిలాబాద్, వెలుగు:  ఆదిలాబాద్ జిల్లాలో రోజురోజుకు తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. మార్చి నెల ఆరంభం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇప్పటికే ఇచ్చోడ, గాదిగూడ, బజార్​హత్నూర్, గుడిహత్నూర్ మండలాల్లో 18 మీటర్ల లోతుల్లోకి భూగర్భ జలాలు పడిపోయాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన గ్రామాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. మిషన్ భగీరథ నీరు వారంలో రెండు మూడురోజులు మాత్రమే సరఫరా కావడం.. గ్రామాల్లో చేతిపంపులు పనిచేయకపోవడంతో బావుల్లో నీరు లేక ఆదివాసీ గూడెలు, తాండాల్లో గిరిజనులు నీటి కోసం విలవిల్లాడుతున్నారు. మిషన భగీరథ మోటర్ల రిపేర్లు లేట్​అవుతుండడంతో చేతి పంపులే ఆధారమవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో తప్పని పరిస్థితిల్లో వ్యవసాయ బోరుబావుల నీటినే తాగేందుకు వాడుతున్నారు.

88 గ్రామాలు సమస్యాత్మకం 

జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, బజార్​హత్నూర్, బోథ్, బేల, నేరడిగొండ మండలాల్లో నీటి సమస్య ఉంది. వేసవి నేపథ్యంలో అధికారులు యాక్షన్​ ప్లాన్ రూపొందించారు. ఈ ఏడాది జిల్లాలోని ఏడు మండలాల్లో 88 హ్యాబిటేషన్లలో తాగునీటి సమస్య ఉంటుందని గుర్తించారు. బోరు బావులు, చేతి పంపుల రిపేర్లు, ఇతర పనుల కోసం రూ.3 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అవసరమైన చోట తాగు నీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతామని ఆర్​డబ్ల్యూఎస్ ఈఈ చంద్రమోహన్ పేర్కొన్నారు. అయితే వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో నీటి సమస్య తీవ్ర స్థాయికి చేరే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఎప్పుడూ నీళ్ల తిప్పలే

ఎండాకాలం వస్తే నీళ్ల తిప్పలే తప్పడం లేదు. ఊరిలో వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ ఎప్పుడు నీళ్లొస్తయో.. ఎప్పుడు రావో తెలియదు. మా ఊరు బయట ఉన్న బావి నుంచే నీళ్లు తీసుకెళ్తున్నం. బిందెలు ఎత్తుకొని చేండ్లలో నుంచి వస్తూ ఇబ్బందులు పడుతున్నం. ఆఫీసర్లు పట్టించుకొని భగీరథ నీళ్లు రోజు వచ్చేలా చూసి మా సమస్య తీర్చాలి– సముద్రబాయి, ఖండాల

ఒక్క చేతి పంపే దిక్కు

మా ఊర్లో ఒక్కటే చేతి పంపు ఉంది. మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే మా ఊరంతటికీ అదే ఆధారం. నెలరోజులైతే ఆ చేతి పంపులో నీళ్లు తగ్గిపోతై. నీళ్ల కష్టం రాకముందైన ఆఫీసర్లు ఇంకో చేతి పంపు ఏర్పాటు చేయాలె. భగీరథ నీళ్లైన మంచిగివ్వాలే. - పెందూర్ రాదాబాయి, టేకిడిగూడ, ఇంద్రవెల్లి

ఓ చేతిపంపు వద్ద పడిగాపులు కాస్తున్న దృశ్యం పంచాయతీ టికేడిగూడలోనిది. ఇంద్రవెల్లి మండలంలోని గట్టేపల్లి పంచాయతీ పరిధి టేకిడిగూడలో 50 కుటుంబాలు నివసిస్తాయి. ఈ గ్రామం మొత్తానికి ఒకే చేతి పంపు ఉంది. మిషన్ భగీరథ నీరు రెండ్రోజులకోసారి వస్తుందని.. ఉన్న చేతి పంపే తమకు ఆధారమని గ్రామస్తులు తెలిపారు. చేతి పంపు హ్యాండ్, చైన్ తెగిపోయే పరిస్థితి ఉంది. మరో చేతి పంపు ఏర్పాటు చేయాలని అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నా స్పందన లేదు.