ఖాళీ బిందెలతో గిరిజనుల రాస్తారోకో

  • వారం రోజులుగా నీళ్ల కోసం 
  • గోస పడుతున్నామని ఆవేదన 
  • ఎంపీడీవో హామీతో విరమణ

లింగంపేట, వెలుగు: తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నా, అధికారులు, లీడర్లు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గురువారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మాలోత్​తండాకు చెందిన గిరిజనులు లింగంపేట అంబేద్కర్​చౌరస్తా వద్ద ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా  తండావాసులు మాట్లాడుతూ వారం రోజులుగా తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని, పంటపొలాల్లోని బోర్లనుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై సర్పంచ్​సునీతను ప్రశ్నించగా ఆమె భర్త ప్రకాశ్​నాయక్ జోక్యం చేసుకుని దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. గిరిజనుల రాస్తారోకోకు బీజేపీ నేత బానాల లక్ష్మారెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు.

మిషన్​ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వానికి గిరిజనుల కష్టాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో మల్లికార్జున్​రెడ్డి ఘటనా స్థలానికి ఏఈను పంపి, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. రాస్తారోకో చేస్తుండగా ఎండకు తట్టుకోలేక తండాకు చెందిన రమావత్​ఫూల్​సింగ్​అనే వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు.