
- పట్టణాల శివారు ప్రాంతాల్లో తప్పని ఇబ్బందులు
- గ్రామాల్లోనూ పైపులైన్, ఇతర సమస్యలతో సప్లై బంద్
- నీటి సమస్యే లేదంటున్న ఆఫీసర్లు
మహబూబాబాద్, వెలుగు : ఏప్రిల్‌లోనే ఎండలు దంచుతున్నాయి. మిషన్ భగీరథ ప్రారంభమైన తర్వాత ఎక్కడా తాగునీటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం చెబుతున్నా పట్టణ శివారు ప్రాంతాలు, గిరిజన తండాలు, గ్రామాల్లో కష్టాలు తప్పడం లేదు. పైపు లైన్ లీకేజీలు, కరెంట్ సమస్యలు, ఇతర కారణాలతో మిషన్ భగీరథ తాగు నీటి పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రజలు తాగునీటి కోసం ఆందోళనకు దిగుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఆఫీసర్లు నేటికీ వేసవిలో తాగు నీటి ఎద్దడి కోసం యాక్షన్ ప్లాన్ రూపొందించ లేదు.
మహబూబాబాద్ జిల్లాలో..
మహబూబాబాద్ జిల్లాలో 1,417 ఆవాసాలకు 7,72,763 జనాభాకు, ప్రతీ వారానికి 73.69 (ఎంఎల్డీల)నీరు అందిస్తున్నామని,1,166 కొత్త ఓహెచ్ఎస్ఆర్లు, 399 పాత ఓహెచ్ఎస్ఆర్లు, 1,443.92 కిలోమీటర్ల కొత్త పైపులైన్, 1,232.71 కిలోమీటర్ల పాత పైపులైన్‌తో నీటి సరఫరా చేస్తున్నట్లు ఆఫీసర్లు రిపోర్టులు రూపొందించారు. రైతు వేదికలు, వైకుంఠధామాలు, స్కూల్స్, అంగన్వాడీలు, ఆరోగ్య ఉపకేంద్రాలకు మొత్తంగా 80.7 శాతం మిషన్ భగీరథ నీరు అందిస్తుమంటున్నా క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధంగా ఉంది.
చేతి పంపులు, వాటర్ ట్యాంకర్లే దిక్కు..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శివారు కాలనీలకు మిషన్‌భగీరథ నీటి సప్లైలో సమస్యలు ఉన్నాయి. ఇందిరానగర్, ఎన్జీవోస్ కాలనీ, లెనిన్ నగర్లో ఇబ్బందుల వల్ల మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తు న్నారు. మరిపెడ మున్సిపాలిటీ మైనారిటీ కాలనీలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో మహిళలు ఆందోళనకు దిగినా ఆఫీసర్లు పట్టించుకోలేదు. దీంతో మహిళలు దగ్గరలోని బోరింగ్ ల వద్ద నీళ్లు తెచ్చుకుంటున్నారు.
తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు
వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతాం. మరిపెడ లోని వాటర్ గ్రిడ్ వద్ద కరెంట్ మోటార్ల లో టెక్నికల్ సమస్యలతో నీటి సరఫరా లో సమస్య ఏర్పడింది. మహబూబా బాద్ టౌన్లో కొన్ని కాలనీల్లో సమస్య ఉంది. వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం.–కృష్ణారెడ్డి, మిషన్ భగీరథ, ఎస్ఈ, మహబూబాబాద్