- ముంచుకొస్తున్న తాగునీటి గండం
- ప్రాజెక్టుల్లో అడుగంటిన నీటి నిల్వలు
- పడిపోతున్న భూగర్భజలాలు
- మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో తాగునీటి కష్టాలు
- పది టీఎంసీల నీరు వదలాలని కర్నాటకకు లెటర్ పెట్టిన రాష్ట్ర సర్కారు
మహబూబ్‌నగర్/నల్గొండ, వెలుగు : రాష్ట్రంలో తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్రౌండ్ వాటర్ స్పీడ్‌గా పడిపోతోంది. దీనికితోడు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. ఈ క్రమంలో నెల రోజులుగా మిషన్ భగీరథ నీటి విడుదలలో ఆఫీసర్లు ప్రెషర్ తగ్గించారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు బోరు నీటినే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా గ్రౌండ్ వాటర్ తగ్గుతుండడంతో రైతులు కొత్త బోర్లు
వేయిస్తున్నారు.
పాలమూరులో 47 గ్రామాల్లో తగ్గిన నీటి నిల్వలు
నిరుడు జనవరిలో మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రౌండ్ వాటర్ లెవల్ 6.36 మీటర్లు ఉండగా, ఈ ఏడాది జనవరిలో 8.88 మీటర్లకు పడిపోయింది. అంటే నిరుడి కన్నా 2.53 మీటర్ల కిందకు నీళ్లు అడుగంటిపోయాయి. గత డిసెంబరులో 8.24 మీటర్ల లోతులో నీళ్లు ఉండగా, జనవరి నాటికి 0.64 మీటర్లకు తగ్గాయి. అలాగే జిల్లాలో 17 మండలాల్లోని 47 గ్రామాల్లో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. ప్రధానంగా వెన్నాచెడ్, వేపూర్, మిడ్జిల్, పోమాల్, కురుమూర్తి, లోకిరేవు, శేరివెంకటాపూర్, జడ్చర్ల, అభంగపట్నం, ఉడిత్యాల్, రాజాపూర్, దోనూరు, గంగాపూర్, కోడ్గల్, కొండేడ్, తీగలపల్లి గ్రామాల్లో భూగర్భ జలాలు పది నుంచి 20 మీటర్లకు పడిపోయాయి.
నెల వ్యవధిలోనే ఈ గ్రామాల్లో దాదాపు మీటర్ లెవల్ నీరు కిందకు వెళ్లిపోయింది. బాలానగర్, పెద్దరేవల్లి, సల్కార్‌పేట, ఏనుగొండ, హన్వాడ, కోడూరు, నాగారం, కౌకుంట్ల, టంకర, దేవరకద్ర, ఎల్కిచర్ల, అడ్డాకుల, కొత్తపల్లి, నవాబ్‌పేట, చిన్నరాజమూరు, మహమ్మదాబాద్, వెలుగోముల, మూసాపేట, తిర్మలాపూర్, మహబూబ్‌నగర్, చిన్నచింతకుంట గ్రామాల్లోనూ భూగర్భ జలమట్టం ఐదు నుంచి పది మీటర్లకు పడిపోయింది. భూత్పూర్, కోయిల్‌కొండ, ఏదులాపూర్, నంచర్ల, గుడిబండ, ఈద్గానిపల్లి, మీనుగువానిపల్లి, దమాయిపల్లి, దమగ్నాపూర్, నిజాలాపూర్ గ్రామాల్లో భూగర్భ జలాలు ఐదు మీటర్ల కిందకు పడిపోయాయి.
వట్టిపోతున్న ప్రాజెక్టులు
ఈ ఏడాది ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుంచి జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో ఎక్కువగా రాలేదు. సాధారణంగా ఏటా జూన్ రెండో వారం నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో నమోదవుతుంది. కానీ, ఈసారి ఆశించిన వర్షాలు లేకపోవడంతో కృష్ణా, భీమా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తలేదు. వాగులు, వంకల నుంచి వచ్చిన వరదతోనే కొంత మేరకు ప్రాజెక్టులకు నీళ్లు చేరాయి. ప్రస్తుతం ఆ నీళ్లు కూడా అడుగంటిపోతున్నాయి. జూరాల కెపాసిటీ 9.66 టీఎంసీలు కాగా.. నిరుడు ఇదే సమయంలో 6.37 టీఎంసీల నీళ్లు ఉండేవి. ప్రస్తుతం 5.10 టీసీఎంల మాత్రమే నీరు నిల్వ ఉంది. శ్రీశైలంలో 215.81 టీఎంసీలకు నిరుడు 58.15 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం 41.57 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది.
భగీరథ నీటి ప్రెషర్ తగ్గించారు
ఇండ్లకు వదులుతున్న భగీరథ వాటర్ ప్రెషర్ ను ఆఫీసర్లు నెల రోజులుగా తగ్గించారు. ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోతుండడంతో ముందస్తుగా తాగునీటి సమస్య రాకుండా, నీళ్లు వృథా కాకుండా తక్కువ ప్రెషర్ తో నీటిని వదులుతున్నారు. అలాగే కొద్ది రోజుల కింద రాష్ట్ర ప్రభుత్వం తరపున కర్నాటక ప్రభుత్వానికి ఆఫీసర్లు లెటర్ రాయించారు. ఎగువన ఉన్న కర్నాటక ప్రాజెక్టుల నుంచి జూరాలకు పది టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో కర్నాటక ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరిగే అవకాశం ఉందని తెలిసింది.
సాగర్ కింద భగీరథ నీళ్లు బంద్
నాగార్జునసాగర్ రిజర్వాయర్ కింద భగీరథ నీళ్లు బంద్ అయ్యాయి. సూర్యాపేట, నల్గొండ జిల్లాలోని చాలా గ్రామాలకు కృష్ణా జలాలు అందడం లేదు. తాగునీటి కోసం మారుమూల గిరిజన తండాలు, గ్రామాల ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. నిరుడు వానలు లేక రెండు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో ఈ వేసవిలో తాగునీటి కష్టాలు మరింత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాగర్ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 518 అడుగుల మేర నీటి నిల్వలు ఉన్నాయి. 312 టీఎంసీలకు గాను 146 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. నల్గొండ జిల్లా ప్రజల తాగునీటి కోసం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, పానగల్లు ఉదయసముద్రం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ALSO READ : ఆన్లైన్లో డ్రగ్స్.. కొరియర్లో డెలివరీ
కానీ, అన్ని గ్రామాలకు పూర్తి స్థాయిలో నీరు చేరడం లేదు. నెల రోజులుగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలో తాగు నీటి కోసం పలు చోట్ల ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. భూగర్భజల వనరుల శాఖ నివేదిక ప్రకారం నిరుడు జనవరిలో 5.27 మీటర్ల లోతులో నీటి మటం ఉండగా, ఈ ఏడాది జనవరిలో 8.68 మీటర్ల అడుగుల లోతుకు పడిపోయింది. అదేవిధం గా సూర్యాపేట జిల్లాలో నిరుడు 4.49 మీటర్లు లోతులో నీటి మట్టం ఉండగా ఈ ఏడాది 7.23 మీటర్ల లోతుకు పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏప్రిల్ నాటికి పది మీటర్ల లోతుకు నీటి మట్టాలు పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.