- 7 మున్సిపాలిటీల్లో అమృత్ 2.0స్కీమ్ అమలు
- రూ.306 కోట్లు కేటాయింపు
- పెరిగే జనాభాకు అనుగుణంగా స్కీమ్
- చెన్నూర్, క్యాతనపల్లిలో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రింకింగ్‌వాటర్ సప్లై వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. కొత్త ప్రభుత్వంపథకం అమలుకు ఆమోదం తెలపడంతో అవాంతరాలు తొలగిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న అమృత్2.0 పథకం అమలుకు నిధుల కేటాయింపు, టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ స్కీమ్ అమల్లోకి వస్తే మంచిర్యాల జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు తాగునీటి కష్టాలు తీరనున్నాయి. 2053 నాటి అవసరాలకు అనుగుణంగా ఈ స్కీమ్‌ను రూపొందించారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర నిధులతో పాటు 15వ ఆర్థిక సంఘం, పట్టణ స్థానిక సంస్థల నిధులు రూ.306 కోట్లు కేటాయించారు. మంచిర్యాల మున్సిపాలిటీకి రూ.48.50 కోట్లు, బెల్లంపల్లికి రూ.61.50 కోట్లు, మందమర్రికి రూ.30.50 కోట్లు, నస్పూర్‌కు రూ.73 కోట్లు, చెన్నూర్‌కు రూ.31 కోట్లు, లక్సెట్టిపేటకు రూ.20 కోట్లు, క్యాతనపల్లి మున్సిపాలిటీకి రూ.41.50 కోట్ల ఫండ్స్కేటాయించారు.
మిషన్‌భగీరథ నీళ్లు వస్తలేవు
ఇంటింటికి తాగునీటి కోసం ఏర్పాటు చేసిన మిషన్‌భగీరథ పథకం మున్సిపల్ ప్రజల దాహార్తిని తీర్చడంలేదు. కొన్ని వార్డులకే పరిమితమైన పథకం ఫలితమివ్వడంలేదు. నాసిరకం పైపుల కారణంగా చాలా చోట్ల డ్యామేజ్, లీకేజీలు అయ్యి వచ్చే కొద్దిపాటి నీళ్లు వృథాగా పోతున్నాయి. మురికి, వాసనతో కూడిన నీళ్లు వస్తున్నాయి. శివారు వార్డులకు ఈ పథకం వర్తింపజేయలేదు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని గద్దెరాగడి, పాత, కొత్త తిమ్మాపూర్ ప్రాంతాల్లో కొత్తగా వెలిసిన కాలనీల్లో ఈ పథకం అమల్లోకి తీసుకురాలేదు. ఇటీవల మందమర్రిలో మార్నింగ్ వాక్చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి స్థానికులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు.
పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు, ఎంపీ
చెన్నూర్‌లో రూ.30 కోట్లు, క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.41.50 కోట్ల ఫండ్స్‌తో చేపట్టనున్న అమృత్2.0 స్కీమ్ పనులకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ నెల 6న శంకుస్థాపన చేశారు. ఈ స్కీమ్ అందుబాటులోకి వస్తే రెండు మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి కష్టాలు తీరనున్నాయి. రెండేళ్లలో పనులు పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ.. స్థానికుల తాగునీటి కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఏడాదిలోపు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని క్యాతనపల్లి మున్సిపాలిటీలో అమృత్ స్కీమ్ టెండర్లు చేపట్టిన హైదరాబాద్‌కు చెందిన కాంట్రాక్టర్ దేవేందర్ రెడ్డికి ఎమ్మెల్యే, ఎంపీ సూచించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని(రైల్వే గేట్ఇవతల) గద్దెరాగడి, పాత, కొత్త తిమ్మాపూర్ప్రాంతాల్లో కొత్తగా వెలిసిన కాలనీలకు కూడా ఈ స్కీమ్ వర్తించేలా వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ చొరవచూపారు.
తాగునీటి కష్టాలు తీరుతాయి
చెన్నూర్, క్యాతనపల్లి, మందమర్రి మున్సిపాలిటీల్లో కొత్తగా మంజూరైన అమృత్2.0 స్కీమ్ పూర్తయితే తాగునీటి కష్టాలు తీరుతాయి. చెన్నూర్‌లో 2వేలు, క్యాతనపల్లిలో 5వేల నల్లా కనెక్షన్లు ఇచ్చి ఇంటింటికీ డ్రికింగ్వాటర్సప్లై చేస్తాం. ఎంపీ గడ్డం వంశీకృష్ణ తాగునీటి సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో మూడు మున్సిపాలిటీలకు అమృత్‌స్కీమ్ మంజూరైంది.- ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి