- మొత్తుకుంటున్న బీఆర్‌ఎస్ లీడర్లు.. పట్టించుకోని ఆఫీసర్లు
- నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి
- తాగునీళ్లు లేక అల్లాడుతున్న 50కి పైగా గ్రామాల ప్రజలు
- వచ్చే ఎన్నికలపై ప్రభావం పడుతుందేమోనని లీడర్ల ఆందోళన
నల్గొండ, వెలుగు: నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో తీవ్ర నీటిఎద్దడి ఉండడం, ఇందుకు మిషన్ భగీరథ లోపాలే కారణం కావడం బీఆర్‌ఎస్ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. అసంపూర్తి పనులు, పైప్‌లైన్ల డ్యామేజీ, సంపులు, ట్యాంకుల మెయింటెనెన్స్ లేకపోవడంతో 50కి పైగా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు.
కొన్ని గ్రామాల్లో యువకులు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. అసలే ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై ఫైర్ అవుతున్నారు. జనరల్ బాడీ మీటింగుల్లో ఎమ్మెల్యేలతో సహా ఎంపీపీలు, జడ్పీటీసీలు, సభ్యులు అధికారులపై ఒంటికాలుపై లేస్తున్నారు.
100 కిలోమీటర్లకు ఒక్కటే మెయిన్ పైప్‌లైన్
దేవరకొండ, చందంపేట, నేరేడుగొమ్ము, డిండి మండలాలకు భగీరథ వాటర్రావాలంటే సుమారు వంద కిలోమీటర్లు ప్రయాణం సాగాల్సిందే. ఈ మండలాలకు నీరు అందించేందుకు మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలం లింగోటంలో పెద్ద ట్యాంకు నిర్మించారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి లింగోటం ట్యాంకులోకి నీటిని పంపింగ్ చేసి.. అక్కడి నుంచి మాల్హైవే మీదుగా దేవరకొండలో పైప్‌లైన్ ఎంటర్ అవుతుంది. ఇక్కడి నుంచి నేరేడుగొమ్ము, చందంపేట, డిండి మండలాల్లోని సుమారు వందకు పైగా గ్రామాలకు నీటిని సప్లై చేయాల్సి ఉంది.
అయితే మెయిన్ పైప్లైన్లు, ఇంట్రాపైప్‌లైన్లు నిత్యం డ్యామేజ్ కావడం, ట్యాంకుల నిర్మాణంలో లోపాల కారణంగా అనేక గ్రామాలకు వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే నీళ్లు వస్తున్నాయి. సుమారు 50 పైగా గ్రామాలకు నీరు అందకపోవడంతో ప్రజలు పంచాయతీ, వ్యవసాయ బోర్లపై ఆధారపడుతున్నారు.
తలాపునే కృష్ణమ్మ ఉన్నా చుక్క నీరు రావట్లే..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని త్రిపురారం, నిడమనూరు, హాలియా మండలాలతో పాటు దేవరకొండ నియోజకవర్గంలోని డిండి, కందుకూర్, గోనబోయినపల్లి, బురాన్పూర్, ప్రతాప్ నగర్, ఎల్లారం, రామంతపురం, వీరబోయినపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. 10 వేల జనాభా ఉన్న త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లిలో పెద్ద రిజర్వాయర్ఉన్నా భగీరథ నీళ్లు మాత్రం రావడం లేదు.
ఇంట్రావిలేజ్ పైప్‌లైన్, వాటర్ ట్యాంకులు డ్యామేజీ కావడంతో సగం వార్డులకు నీళ్లు రావడం లేదు. ముఖ్యంగా ఎస్సీ కాలనీ, బెస్త కాలనీలో తాగునీటి సమస్య జటిలంగా ఉంది. ఒక్క రిజర్వాయర్నుంచి చుట్టు పక్కల 36 గ్రామాలకు నీటి సప్లై జరుగుతుండడం గమనార్హం. ఇక నిడమనూరు, హాలియా మండలాల్లో భగీరథ నీటిలో మురుగునీరు కలుస్తోంది. ట్యాంకుల నిర్వహణ విషయంలో ఆర్డబ్ల్యూఎస్అధికారులు, గ్రామపంచాయతీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ట్యాంకుల బాధ్యత జీపీలదేనని అధికారులు చెబుతుండగా.. నిధుల్లేకుంటే తామేం చేస్తామని పాలవర్గం అంటోంది.
భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ ఆఫీసర్లపై ఫైర్
మండల పరిషత్, జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగుల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నీటి ఎద్దడి విషయంలో భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ ఆఫీసర్లపై సీరియస్ అవుతున్నారు. ఇటీవల నిర్వహించిన జడ్పీ సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ భగీరథ స్కీమ్ ఆగం పట్టించారని మండిపడ్డారు. డిండి, దేవరకొండ, నేరేడుగొమ్ము, చందంపేట మండలాల్లోని గ్రామాలకు చుక్క నీరు రావడం లేదని, ఇంజనీర్లే పథకాన్ని ఫెయిల్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏదో సాకు చెప్పడం కాదని, తాగు నీటి సరఫరాలో ఎక్కడ సమస్య వస్తుందో చూసి పరిష్కరించాలని సూచించారు.
కేటీఆర్‌కు ఫిర్యాదు చేసినా సమస్య తీరలే
మా గ్రామానికి భగరీథ నీళ్లు రావడం లేదని మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా కంప్లైట్ చేసి ఇరవై రోజులైనా సమస్య తీరలే. తలాపునే కృష్ణమ్మ ప్రవహిస్తున్నా నీళ్లు మాత్ర రావడం లేదు. 10 వేల మంది జనాభా ఉన్న గ్రామంలో భగీరథ పైప్‌లైన్ల పనులు అడ్డగోలుగా చేసి వదిలేశారు. ఇంట్రా విలేజ్పైప్లైన్లు పూర్తిగా డ్యామేజీ అయ్యాయి. వాటిని సరిచేస్తామని చెప్పిన అధికారులు పత్తా లేకుండా పోయారు.
–ఇరుగి క్రాంతి కుమార్, పెద్దదేవులపల్లి, త్రిపురారం మండలం
నీళ్లను కొనుక్కొని తాగాల్సి వస్తోంది
మా గ్రామానికి మిషన్ భగీరథ నీరు వారానికి రెండు రోజులు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో తప్పని పరిస్థితుల్లో వాటర్ ప్లాంట్ల నుంచి నీటిని కొనుక్కోవాల్సి వస్తోంది. ఇంకొన్ని సందర్బాల్లో బోరు వాటర్ వాడుకుంటున్నం. పైప్లైన్లు సరిగా లేకపోవడంతో సమస్య వస్తోంది.
- బానోత్ సక్రు, డిండి