డెడ్ స్టోరేజీకి చేరువలో ఎల్‌‌‌‌ఎండీ .. ప్రస్తుతం డ్యాంలో 5.7టీఎంసీలు

డెడ్ స్టోరేజీకి చేరువలో ఎల్‌‌‌‌ఎండీ .. ప్రస్తుతం డ్యాంలో 5.7టీఎంసీలు
  • ఎండాకాలంలో పొంచి ఉన్న తాగునీటి గండం
  • ఈ నెల 3 వరకు కాకతీయ కెనాల్ కు నీటి విడుదల 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలకు సాగునీరు, కరీంనగర్ బల్దియాకు తాగునీటి అవసరాలను తీర్చే లోయర్ మానేరు డ్యామ్ డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. ఈ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 24 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 5.7 టీఎంసీలే ఉంది. ఎల్‌‌‌‌ఎండీ డ్యామ్ డెడ్ స్టోరేజీ 2.5 టీఎంసీలు కాగా అదనంగా మూడు టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దీంతోపాటు 2 టీఎంసీలు వచ్చే రెండున్నర నెలల్లో ఎండల కారణంగా ఆవిరయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే ఈ వేసవిలో కరీంనగర్ బల్దియాకు తీవ్ర తాగునీటి ఎద్దడి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎల్‌‌‌‌ఎండీలో నీటిమట్టం తగ్గడంతో ఇప్పటికే కరీంనగర్ సిటీకి నీళ్లందించేందుకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ బూస్టర్లను రన్ చేస్తూ రా వాటర్ తీసుకొని శుద్ధి చేస్తున్నారు.  

డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో కమిషనర్‌‌‌‌‌‌‌‌కు ఇరిగేషన్ ఎస్ఈ లేఖ 

ఎల్‌‌‌‌ఎండీ నుంచి ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తున్నారు. సాగునీటి అవసరాలు తీర్చడంతోపాటు మిషన్ భగీరథకు ఇందులో నుంచి 6.160 టీఎంసీలు కేటాయించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ సూచన మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేకపోవడం, సాగునీటి అవసరాలకు నీరు విడుదల చేయడం వల్ల తాగునీటికి నీళ్లివ్వలేమని, కరీంనగర్ బల్దియాలో తాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయం చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌‌‌‌‌‌‌‌కు గత డిసెంబర్ 13న ఇరిగేషన్ ఎస్ఈ లేఖ రాశారు. ఈ లేఖను ఎమ్మెల్యే గంగుల సోమవారం విడుదల చేశారు.

ఈ నెల 3 వరకు కాకతీయ కెనాల్‌‌‌‌కు నీటి విడుదల 

లోయర్ మానేరు డ్యామ్ నుంచి కాకతీయ కెనాల్ కు డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు విడుదల చేయాలని ముందు నిర్ణయించారు. దిగువన చివరి తడుల కోసం సాగునీటి విడుదలను మరో మూడు రోజులు పెంచారు. ప్రస్తుతం రోజుకు 5,500 క్యూసెక్కుల నీటిని(సుమారు అర టీఎంసీ) కిందికి వదులుతుండగా.. మిడ్ మానేరు నుంచి 3వేల క్యూసెక్కులు వస్తోంది.