
- వారం రోజులుగా ఇబ్బంది పడుతున్న జనం
బెల్లంపల్లి, వెలుగు: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అడా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు గేట్లను ఎత్తివేశారు. అయితే, ప్రాజెక్టులోని ప్లాంట్ఇన్టెక్ వెల్‌లో సమస్యల కారణంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని 266 గ్రామాలు, బెల్లంపల్లి మున్సిపాలిటీకి వారం రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుమ్రం భీం జిల్లా కెరమెరి మండలంలోని అడా ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ఈనెల 20న అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేశారు.
పట్టించుకోని అధికారులు
అయితే, మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్ట్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఇన్‌టెక్ వెల్‌కు ఇన్ ఫ్లో తగ్గిపోయి, మోటార్ల ద్వారా సరిపడా నీరు సరఫరా కావడం లేదు. అంతేకాకుండా వరద కారణంగా ఇన్ టెక్ వెల్ పైపు లైన్‌కు అడ్డంగా చెత్త వచ్చి చేరి నీరు సరఫరా కావడంలేదని తెలుస్తోంది. దీంతో బెల్లంపల్లి మున్సిపాలిటీ, బెల్లంపల్లి రూరల్, తాండూర్, నెన్నెల, కాసిపేట, వేమనపల్లి, భీమిని, కన్నెపల్లి మండలాల్లోని 266 గ్రామాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. నీళ్లు లేక వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో సమృద్ధిగా నీరున్న సమయంలో ప్రజలకు తాగునీటి కష్టాలు రావడం పాలకుల వైఫల్యాన్ని చాటుతోంది. ఇప్పటికైనా స్పందించి సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.