హైదరాబాద్​లో మూడేండ్ల వరకు తాగునీటికి బే ఫికర్​

హైదరాబాద్​లో మూడేండ్ల వరకు తాగునీటికి బే ఫికర్​
  • నిండు కుండల్లా ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్​
  • సింగూరు, నాగార్జున సాగర్, ఎల్లంపల్లి కూడా ఫుల్​
  • నీటి సరఫరా పెంచాలని వాటర్​బోర్డు నిర్ణయం

గత వేసవిలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రేటర్​లో తాగునీటి సమస్య ఏర్పడింది. నగరానికి డ్రింకింగ్​ వాటర్​ అందించే ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో వాటర్​బోర్డుపై ఒత్తిడి పెరిగింది. దీంతో నగరానికి ప్రధాన జలవనరులైన నాగార్జున సాగర్, ఎల్లంపల్లి నుంచి పంపింగ్​ద్వారా నీటిని తరలించాల్సి వచ్చింది. కానీ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరానికి నీటి సరఫరా చేసే ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో మరో మూడేండ్ల వరకు తాగునీటి తిప్పలు తప్పినట్టేనని అధికారులంటున్నారు.  

హైదరాబాద్​సిటీ, వెలుగు : గ్రేటర్ ​హైదరాబాద్​కు తాగునీరందించే జలాశయాలన్నీ వర్షాలతో నిండు కుండల్లా మారాయి. ఒక్కో ప్రాజెక్టులో నీటి మట్టాలు పూర్తిస్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో నగరానికి నీటి కొరత అన్నది లేకుండా అన్ని ప్రాంతాలకు అవసరమైనంత నీటిని సరఫరా చేస్తామని మెట్రోవాటర్​బోర్డు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతుండడంతో..మరో రెండు, మూడేండ్ల వరకు అనుకున్న స్థాయిలో వర్షాలు పడకపోయినా ఉన్న నీటితో గ్రేటర్​తాగునీటి అవసరాలు తీర్చవచ్చంటున్నారు. 

ఆ ఆరు ప్రాజెక్టులకు జలకళ

వర్షాలతో నాగార్జునసాగర్, ఎల్లంపల్లి, సింగూరు, మంజీరా, ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్​జలాశయాల్లోకి పెద్దమొత్తంలో వరద చేరుతోంది.  ప్రధానంగా నగరానికి తాగునీరందిస్తున్న నాగార్జున సాగర్ నుంచి కృష్ణా ప్రాజెక్టు మూడు దశల్లో 270 ఎంజీడీలను సిటీకి తీసుకువస్తున్నారు. సాగర్​పూర్తిస్థాయి నీటిమట్టం 312.45 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 305.500 టీఎంసీల నీరుంది. గోదావరి మొదట దశ ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి రిజర్వాయర్​నుంచి రోజుకు 166 ఎంజీడీలను నగరానికి తరలిస్తున్నారు. ఎల్లంపల్లి పూర్తి కెపాసిటీ 20.175 టీఎంసీలు కాగా,  ఇప్పుడు ప్రాజెక్టులో19 టీఎంసీలున్నాయి. 

సింగూరు, మంజీరా ప్రాజెక్టుల నుంచి రోజుకు 40 ఎంజీడీలు తరలిస్తున్నారు. సింగూరు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ఇప్పటికే 20 టీఎంసీల నీళ్లు చేరాయి. అలాగే, మంజీరా ఫుల్​కెపాసిటీ1.500 టీఎంసీలు కాగా, 1.871 టీఎంసీల వాటర్​వచ్చింది. ఉస్మాన్​సాగర్, హిమాయత్​ సాగర్ల నుంచి రోజుకు 24 ఎంజీడీలను మెట్రోవాటర్​బోర్డు అధికారులు తరలిస్తున్నారు. ఉస్మాన్​సాగర్​పూర్తి సామర్థ్యం 3.900 టీఎంసీలు కాగా, 3.050 టీఎంసీలు, హిమాయత్​సాగర్​పూర్తి కెపాసిటీ 2.900 టీఎంసీలు కాగా, 2.318 టిఎంసీల నీరుంది. ఇలా అన్ని ప్రాజెక్టులు 90 శాతం నీటితో కళకళలాడుతున్నాయి. 

 సరఫరా పెంచుతాం

ప్రాజెక్టుల్లో కావాల్సినంత నీళ్లుండడంతో గ్రేటర్​పరిధిలోని అన్ని ప్రాంతాలకు అవసరమైన నీటిని సరఫరా చేస్తామని వాటర్​బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వాటర్​బోర్డు పరిధిలోని 23 డివిజన్లకు రోజుకు 490 నుంచి 500 ఎంజీడీలను సరఫరా చేస్తున్నారు. నిజానికి నగరానికి రోజుకు 650 ఎంజీడీల డిమాండ్​ఉండగా, అధికారులు 500 ఎంజీడీల వరకే సరఫరా చేయగలుగుతున్నారు. 

గత వేసవిలో 550 ఎంజీడీలు సరఫరా చేయగా, ప్రస్తుతం అన్ని ప్రాజెక్టుల్ల పూర్థి స్థాయి నిల్వలు ఉండడంతో రాబోయే కాలంలో ఎక్కువ నీటిని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ముఖ్యంగా ఔటర్​రింగ్​రోడ్​పరిసర గ్రామాలు, మున్సిపాలిటీలు, విల్లాలకు గత వేసవిలో డిమాండ్​కు తగినంత సరఫరా చేయలేక పోయారు. కానీ, త్వరలో ఔటర్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు కూడా డిమాండ్​కు తగినంత నీటిని అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఔటర్​వాటర్​ప్రాజెక్టు పేరుతో రెండు దశల్లో ఆయా ప్రాంతాల్లో సర్వీస్​రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. 

ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తికాగా, రెండో దశ పనులు కూడా త్వరలో పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. ఈ రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయితే ఔటర్​పరిధిలోనే కాకుండా త్వరలో జీహెచ్​ఎంసీ  పరిధిలో విలీనమవుతున్న గ్రామాలకు సైతం తాగునీటిని మెట్రోవాటర్​బోర్డు సరఫరా చేస్తుందని అధికారులు వెల్లడించారు.